ఆళ్లగడ్డ (విభారె న్యూస్):
భారతదేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న ఆళ్లగడ్డలోని జీటీఆర్ఎం జూనియర్ కళాశాలలో ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ అంజయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకల్లో… చరిత్ర అధ్యాపకులు శ్రీనివాసులు మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత చరిత్రను, దేశ స్వాతంత్ర్యం అనంతరం వివిధ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసి దేశ సమైక్యతకు ఆయన చేసిన విశేష కృషిని విద్యార్థులకు వివరించారు. దేశభక్తి మరియు జాతీయ ఐక్యత ప్రాధాన్యతను కొనియాడుతూ విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా ‘మై భారత్’ (MY Bharat) బృందం సభ్యులు మాట్లాడుతూ.. మై భారత్ పోర్టల్ ప్రాముఖ్యతను విద్యార్థులకు విశదీకరించారు. యువత వెంటనే ఈ పోర్టల్లో పేరు నమోదు చేసుకుని, దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ యువజన అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరితోనూ జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ పునరంకితమై ఉండాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.