ఆళ్లగడ్డ (విభారె న్యూస్):31అక్టోబర్
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘మేరా యువ భారత్’ (నంద్యాల జిల్లా) ఆధ్వర్యంలో శనివారం ఆళ్లగడ్డ మండలం యర్రగుంట్లలోని GTRM డిగ్రీ కళాశాలలో “నషా ముక్త యువ – మాదకద్రవ్య రహిత యువత” అనే అంశంపై నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) డీ-అడిక్షన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగార్జున, క్లినికల్ సైకాలజిస్ట్ స్వరూపారాణి, ఈగల్ టీమ్ ప్రతినిధి ప్రసాద్, మేరా యువ భారత్ బృందం సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వినియోగం వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతిని ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుందని హెచ్చరించారు. యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
క్లినికల్ సైకాలజిస్ట్ స్వరూపారాణి మాట్లాడుతూ… మత్తు పదార్థాల వ్యసనం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు తలెత్తుతాయని, ఇది వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈగల్ టీమ్ ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ… మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంలో పాల్గొంటే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరించారు. ఇటువంటి చర్యలు యువత విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి, భవిష్యత్తును అంధకారం చేస్తాయని హెచ్చరించారు.
మేరా యువ భారత్ ప్రతినిధులు మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా యువత అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న వాలంటీరింగ్ సేవలు, నాయకత్వ శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. యువత మేరా యువ భారత్ పోర్టల్లో పేరు నమోదు చేసుకుని వివిధ జాతీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
స్లోగన్ బాక్స్ ప్రారంభం – ప్రతిజ్ఞ:
యువతలో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ సందర్భంగా ‘స్లోగన్ బాక్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులందరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, నషా ముక్త భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రిన్సిపాల్ ఇందిరావతి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.