- – నేను చెప్పిందే వినాలి..పెట్టిందే తినాలి..
- – విద్యార్థులకు మెనూ ప్రకారం అందని ఆహారం
- – దోమతెరలు లేక ఇబ్బందులు..
- – సమస్యలపై నిలదీస్తే విద్యార్థులకు బెదిరింపులు
- – పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
- – ఎవరికి చెప్పుకోవలో విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి
- – ప్రధానోపాధ్యాయురాలుపై చర్యలు తీసుకోవాలి
- – న్యాయం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు
కరీంనగర్ ప్రతినిధి-జ్యోతి న్యూస్
వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన విద్యార్థుల చదువుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గురుకుల, మోడల్ స్కూళ్ళు,గిరిజన సంక్షేమ పాఠశాలల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తిస్థాయిలో విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. కూలి పని చేసుకుని జీవించే తల్లిదండ్రులపై వారి పిల్లల చదువులు భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో విద్యార్థి పై లక్షల రూపాయలు వెచ్చించి నాణ్యమైన విద్యను అందిస్తుంటే కొంతమంది అక్రమ అధికారులు నిబంధనలను తుంగలోతొక్కి బేేఖాతరు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలురు) లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారం అందడం లేదు.. వారంలో అల్పాహారంగా చపాతీ,బోండా, ఉప్మా,చట్నీ,నూడుల్స్,కిచిడి,సాంబార్,పులిహోర,పూరి,ఇడ్లి,పొంగలి,జీరారైస్ మరియు స్నాక్స్ పెట్టాల్సి ఉండగా ఒక పులిహోర మాత్రమే పెడుతున్నారని సమాచారం.ఇది ఇలా ఉండగా వారం మొత్తంలో కూరగాయలు, ప్రతి ఆదివారం చికెన్ లేదా మటన్ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆదివారం ఒక చికెన్ మాత్రమే నాణ్యతా ప్రమాణాలు లేకుండా చాలీచాలకుండా పెడుతున్నారు. వరుసగా రెండు, మూడు రోజులు ఒకే కూర వండించి పెడుతున్నారని,ఉదయం మిగిలిన ఆహారం మళ్ళీ రాత్రికి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాకాలంలో కనీసం దోమకాటుకు గురికాకుండా దోమతెరలు కూడా విద్యార్థులకు అందని పరిస్థితి నెలకొంది. దోమ కాటు వలన విద్యార్థులకు విషజ్వరాలు సోకె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.
పుస్తకాల పంపిణీలో కూడా జాప్యం జరుగుతోందని, బయట విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. పౌష్టికాహారం అందించడంలో జాప్యం జరుగుతోందని విద్యార్థి సంఘాలు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ తతంగాలు బయటికి పొక్కకుండా ప్రధానోపాధ్యాయురాలు స్వరూప విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తోంది.ఇటీవలే విద్యార్థుల పడక గదిలో బెడ్ పై నిలబడితే సీలింగ్ ఫ్యాన్ తాకే ప్రమాదం ఉందని ఓ విద్యార్థి బెడ్ పై నిలబడి ఫోటో దిగగా అది న్యూస్ పేపర్లో రావడంతో ఆ విద్యార్థిని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. కరీంనగర్‌కు కూతవేటు దూరంలోనే ఇంత దోపిడీ జరుగుతుంటే మరీ మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల వసతి గహల్లో ఎలాంటి పరిస్థితి నెలకొనిఉంటుందో చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా మొత్తానికి ప్రధానోపాధ్యాయు రాలు,వార్డెన్ ఆయిన స్వరూప నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అందాల్సిన కనీస సౌకర్యాలను పక్కదారి పట్టిస్తు విద్యార్థులను,ప్రభుత్వాన్నీ మోసం చేస్తున్న ఆమెపై విద్యాశాఖ అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.