ప్రైవేటీకరణ దిశగా రైల్వే

మోడీ సర్కార్‌ రెండవసారి అధికారంలోకి రాగానే దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉంటూ, లాభసాటిగా ఉన్న 46 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రజలు, ఉద్యోగుల కష్టార్జితంతో కూడబెట్టిన లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న రైల్వేను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి సిద్ధమైంది. వంద రోజుల ప్రణాళిక ప్రకటించింది. లాభసాటిగా ఉన్న మార్గాల్లోనే ప్రైవేటు రైళ్ళకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. రోలింగ్‌ స్టాకుగా చెప్పే ఇంజన్లు, వ్యాగన్లు, బోగీలు, చక్రాల తయారీ తదితర 7 ఉత్పత్తి కేంద్రాలను ప్రైవేటుపరం చేయడానికి సమాయత్తమవుతోంది. ఎ-1, ఎ కేటగిరీలుగా ఉన్న 400 రైల్వే స్టేషన్లను 45 సంవత్సరాలు లీజుకివ్వడంతో పాటు స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, మాల్స్‌, ఫ్లాట్‌ఫారాల టికెట్లు అమ్మకం వంటి వాటిని ప్రైవేటు వారికి అప్పచెప్తారు. దీని కోసం ఇప్పటి వరకూ ప్రయాణ చార్జీలపై ఇస్తున్న 47 శాతం సబ్సిడీని ‘వదులుకోండి’ (గివ్‌ ఇట్‌ అప్‌) అంటూ విస్త త ప్రచారం చేస్తున్నారు. తద్వారా ప్రజలపై చార్జీల భారం మోపడానికి సిద్ధమయ్యారు. ‘పబ్లిక్‌ సెక్టార్‌ పుట్టిందే సహజ మరణాని’కనే మోడీ వాక్కు నిజం చేయడానికే ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు కదిలింది. 
ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రజలకు చవకైన, సురక్షితమైన ప్రజా రవాణాని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. వందేళ్ళ భారత రైల్వేలు 70 వేల కి.మీ ట్రాక్‌ విస్తీర్ణం, రెండున్నర కోట్ల మంది ప్రజల్ని రోజువారీగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. 8 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు, సిమెంటు, ఇనుము, ఆహారధాన్యాలు తదితర నిత్యావసరాలను ప్రజలకు చవకగా, నాణ్యంగా సకాలంలో అందిస్తున్నాయి. దేశం లోని ఇతర రవాణాతో పోల్చితే రైలు రవాణా చాలా చవక మరియు సురక్షితం. రైల్వేలో ప్రవేశించే ప్రైవేటు పెట్టుబడిదారులు ఈ సౌకర్యాలు కల్పించగలరా? రైల్వేలు ఇచ్చే రాయితీలు ఏ రవాణా వ్యవస్థ ఇవ్వడం లేదు. ఉదాహరణకు సీనియర్‌ సిటిజన్లకు కన్సెషన్‌, ఆర్మీ, వికలాంగులు, ఎం.పి. తదితర ప్రజాప్రతినిధులకు ఉచిత, రాయితీలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో సర్వీసుల నిర్వహణ, ప్రజల సౌకర్యార్ధం కొత్త రైళ్ళు, లైన్లు ఏర్పాటు, తక్కువ ధరకు ఆహార, నిత్యావసరాల రవాణా ద్వారా రైల్వే ఇచ్చే సబ్సిడీ ఏటా రూ.33 వేల కోట్లు. దీనికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు లేదు. రైల్వేలే భరిస్తున్నాయి. పైగా ప్రభుత్వానికి డివిడెంట్ల కింద ఏటా రూ.9-10 వేల కోట్లు ఇస్తున్నాయి. ఈ సౌకర్యాలు ప్రైవేటు వాళ్ళు ఇవ్వగలరా? 13 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 7 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు మొత్తం 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న అతి పెద్ద ప్రభుత్వ సంస్థ రైల్వే. ఇంత మందికి ఏ ప్రైవేటు సంస్థయినా ఉపాధి కల్పించగలదా? 92 సంవత్సరాల రైల్వే ప్రత్యేక బడ్జెటును మోడీ ప్రభుత్వం జనరల్‌ బడ్జెట్‌లో కలిపేసింది. రైల్వేల ఆధునీకరణకు నిధులు లేనందున ప్రైవేటు సంస్థల్ని ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజు రైల్వే సామాజిక సేవను గుర్తించి ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది? క్రమక్రమంగా బడ్జెట్‌ సహాయానికి కోత విధిస్తుంది. వాస్తవానికి 2016-17లో 60 వేల కోట్ల రూపాయలు సహాయం చేసిన ప్రభుత్వం 2017-18లో దానిని రూ.42 వేల కోట్లకు కుదించింది. ఏడవ ప్రణాళికలో దేశవ్యాపిత (ట్రాన్స్‌పోర్టు సెక్టారు) రవాణా రంగంలో రైల్వే వాటా 56 శాతంగా ఉంటే 11వ ప్రణాళిక నాటికి 25 శాతానికి పడిపోయింది. 2016-17లో రూ.1.7 లక్షల కోట్లు అవసరమైతే రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి చివరకు రూ.32 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం చూస్తుంటే రైల్వేల సహజ మరణానికే మోడీ ప్రభుత్వం పునాది వేస్తున్నట్లు వుంది. 
రైల్వేల ఆధునీకరణకు, లైన్ల విస్తరణకు పెట్టుబడుల సమీకరణ అవసరమే. దీనికి ప్రభుత్వమైనా తోడ్పడాలి లేదా ఆర్థిక సంస్థల తోడ్పాటుకైనా అనుమతివ్వాలి. మోడీ ప్రభుత్వం ఈ రెండు పనులూ చేయడం లేదు. 30 సంవత్సరాల తరువాత తిరిగి చెల్లించే పద్ధతిలో రైల్వేకు రూ.లక్షన్నర కోట్లు అందించడానికి ఎల్‌.ఐ.సి సిద్ధపడింది. ప్రభుత్వం దీనికి ఎందుకు అనుమతి ఇవ్వదు? ప్రైవేటు పెట్టుబడిదారులు అంత పెట్టుబడి రైల్వేలో పెట్టగలరా? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక రంగ ముఖ్య సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ చెప్పినట్లు ఏ ప్రైవేటు సంస్థ రైల్వేలో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధం కాదని ప్రైవేటు పెట్టుబడులకు ఎంత ఆహ్వానం పలికినా అవి ఆచరణలో రావడం లేదనేది వాస్తవం కాదా? చైనా అనుభవమే చూస్తే మనకన్నా 11 రెట్లు ఆర్థిక సహాయం ఆ దేశ ప్రభుత్వం రైల్వేలకి చేసింది. పర్యవసానంగా 10 సంవత్సరాల వ్యవధి లోనే 60 వేల కి.మీటర్ల రైలు ట్రాక్‌ 90 వేల కి.మీటర్లకు పెరిగింది. అదే సమయంలో మన దేశంలో 62 వేల నుండి 64 వేలకు మాత్రమే పెంచుకోగలిగాం. సామాజిక బాధ్యత నిర్వహిస్తున్న రైల్వేలకి ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటు ఇదేనా? ఈ వాస్తవాలను మరుగుపర్చి పెట్టుబడులు అవసరం కాబట్టి ప్రైవేటీకరిస్తామనడం ‘రోగం ఒకటైతే మందొకటి వేయడమే’. ప్రపంచంలో ఏ దేశం లోనూ ప్రైవేటీకరణ అనుకూల ఫలితాలు ఇవ్వలేదని, ప్రైవేటుపరం చేయడం తెలివి తక్కువ తనమని ‘మెట్రో మాన్‌’గా పిలువబడే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎం.డి ఇ.శ్రీధరన్‌ అనుభవ పూర్వకంగా చెప్పారు. మన దేశం లోనే 11 కి.మీ.ల ముంబాయి మెట్రో లైన్‌ పూర్తి చేయడానికి అంబానీ యజమానిగా ఉన్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ 7 సంవత్సరాల సమయం తీసుకుంది. ఆ లైన్లో భారీగా చార్జీలు వసూలు చేస్తోంది. అయినా నష్టాలొస్తున్నాయని చెబుతోంది. ఢిల్లీ మెట్రో ఎయిర్‌ఫోర్సు లైన్లో రిలయన్స్‌ సంస్థ సిగళ్లు, రోలింగ్‌ స్టాక్‌, విద్యుదీకరణలో పెట్టుబడులు పెట్టింది. నష్టాలొస్తున్నాయని వదిలేసింది. దీంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ మళ్లీ స్వాధీనం చేసుకొని నడపాల్సి వచ్చింది. 
గ్రేట్‌ బ్రిటన్‌లో 1996లో రైల్వే ప్రైవేటీకరణ చేపట్టారు. 25 ట్రైన్‌ ఆపరేటింగ్‌ కంపెనీల కింద ముక్కలు చేశారు. 2003 నాటికి రైలు ప్రమాదాలు పెరిగాయి. వందలాది మంది చనిపోయారు. ప్రయాణీకుల మీద చార్జీల భారం పెరిగింది. చివరకి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి తిరిగి జాతీయం చేసి స్వాధీనపర్చుకుంది. న్యూజిల్యాండ్‌లో ప్రైవేటీకరణ తరువాత 21 వేల మంది ఉద్యోగులకు గాను 4 వేల మందే మిగిలారు. తిరిగి 2004లో ప్రభుత్వం దాన్ని జాతీయం చేసింది. అర్జెంటీనాలో ప్రైవేటీకరణ చేసిన తరువాత 47 వేల రన్నింగ్‌ కి.మీటర్ల లైను 8 వేలకు పడిపోయింది. 95 వేల ఉద్యోగస్తుల స్థానే 15 వేలకు కుదించబడ్డారు. 800 రైల్వే స్టేషన్లు మూసివేశారు. 70 శాతానికి పైగా చార్జీలు పెరిగాయి. వ్యవసాయం సంక్షోభంలో పడింది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దానిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇన్ని అనుభవాలు దేశంలో, విదేశాల్లో కనబడుతున్నా ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణకు పూనుకోవడం విజ్ఞతేనా? ప్రభుత్వ విధానం స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్ల రైల్వే ఆస్తుల్ని కట్టబెట్టడం, లాభాలు ఇవ్వడం. నష్టాలు రైల్వేకు, ప్రభుత్వానికి, ప్రజలకా? లాభసాటిగా ఉన్నటువంటి రూట్లు, పోర్టు కనెక్టివిటీ, ప్రధాన ఆదాయ వనరులైన ప్రయాణీకుల ప్రయాణ రూట్లను ప్రైవేటువారికి ఇస్తారు. నష్టాలు వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు సర్వీసులు నడపరు. ప్రైవేటు వారు మనం ఆర్జించి పెట్టుకొన్న రైలు పట్టాల్ని, ఇంజన్లను, బోగీలను మెయింటనెన్స్‌ అండ్‌ సర్వీసు విభాగాలన్నింటీని వినియోగించు కుంటారు. రైల్వే ఆస్తుల్ని గ్యారంటీగా పెట్టి వేల కోట్లు మన బ్యాంకుల నుండే అప్పులు తీసుకొని వాటినే తమ పెట్టుబడులంటారు. మనకి నామమాత్రపు లీజుల్ని చెల్లిస్తారు. పెట్టుబడులు పెద్దగా పెట్టకుండా లాభాల్ని మాత్రం స్వాహా చేస్తారు. ‘మేకిన్‌ ఇండియా’ అంటూ కొత్తగా వాళ్ళే లైన్లు వేసుకొని ఇంజన్లు, బోగీలు ఉత్పత్తి చేసుకొని నడుపుతారా అంటే అది జరగని పని. మరి సొమ్మొకడిది-సోకు ఇంకొకడిదన్నట్లు ఆస్తులు రైల్వేలవి-ఆదాయం ప్రైవేటు వాళ్ళకా! ప్రైవేటీకరణ ద్వారా భద్రత కొరవడుతోంది. సిబ్బందిపై ఆదనపు భారం పడుతోంది. ఉన్న ట్రాకులు రెన్యువల్‌ చేయరు, కొత్త ట్రాకులు ఏర్పాటు చేయరు. నాణ్యమైన ప్రయాణం, సమయపాలన ఉండే అవకాశమే లేదు. రైళ్ళ ప్రమాదాలు పెరుగుతాయి. ఈ దేశ ప్రజలకి ప్రైవేటు వారు ఇచ్చే నజరానాలు ఇవి. వీటిని స్వీకరిద్దామా? రైల్వే స్టేషన్ల పరిసరాల్ని ప్రైవేటీకరించడం ద్వారా ప్రైవేటు వ్యక్తులు హోటళ్లు, సినిమా హాళ్ళు, మాల్స్‌, రెస్టారెంట్లు తదితరమైనవి నిర్మించడం ద్వారా రూ.వందల కోట్ల లాభాలు ఆర్జిస్తారు. ప్లాట్‌ఫామ్‌ చార్జీలు, ప్రయాణ, రవాణా చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై భారాలు పెంచుతారు. ఇక నుండి పట్టాలు మనవి, దానిపై నడిచే రైళ్ళు మాత్రం మోడీవి, అంబానీవి, అదానీవి, మిట్టల్‌వా? దేశంలో డీజిల్‌ ఇంజన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ఇంజన్లు విదేశీ కంపెనీలకన్నా 3,4 రెట్లు తక్కువకు, నాణ్యతకు మన రైల్వే కార్మికులు తయారు చేస్తుంటే వాటిని ఈ రోజు ప్రైవేటుపరం చేయడం న్యాయమా? అమెరికా కేంద్రంగా ఉన్న జనరల్‌ ఎలక్ట్రికల్‌ సంస్థ వేయి ఇంజన్లు ఇవ్వడానికి 10 సంవత్సరాల వ్యవధి అడిగింది. మన దేశంలో వారణాసి, మదేపుర్రా లోని లోకోమోటివ్‌ తయారీ కేంద్రాలు సంవత్సరానికి 330 చొప్పున చవకగా, నాణ్యంగా, హైస్పీడ్‌ కెపాసిటీతో తయారు చేస్తున్నాయి. జి.ఇ, ఫ్రాన్స్‌ కంపెనీ అల్స్‌స్థోమ్‌ సంస్థకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్‌ రూ.40 వేల కోట్లు. మన రైల్వేలో వీటిని రూ.20 వేల కోట్లకే ఉత్పత్తి చేయగలమని, అందించగలమని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఆర్‌.ఇ ఆచార్య ఆధారాలతో సహా ప్రకటించారు. ఇదేనా ‘మేకిన్‌ ఇండియా?’ బిజెపి, మోడీ చేస్తున్నది దేశభక్తా? దేశ ద్రోహమా? ప్రజలు ఆలోచించాలి. 
20 లక్షల మంది ఉద్యోగస్తులు ప్రత్యక్షంగా పని చేస్తున్నారు. పరోక్షంగా రైల్వేపై ఆధారపడిన వారు, సంస్థలు కోట్లాదిగా వున్నాయి. దేశం లోనే ప్రభుత్వాధీనంలో ఉన్న ఏకైక అతి పెద్ద ప్రభుత్వ ఉపాధి సంస్థ ఇది. ఎస్సీ, ఎస్టీ, బి.సి, మహిళలకు రిజర్వేషన్లు, ఉద్యోగస్తులకు పని భద్రత, జీతాలు, పెన్షన్లు గ్యారంటీ చేయబడినవి. ఈ సంస్థను ప్రైవేటు వ్యక్తులు హస్తగతం చేసుకుంటే ఉన్న సిబ్బందిని కొనసాగిస్తారా? రిజర్వేషన్లు అమలు జరుపుతారా? జీతభత్యాలకు, పెన్షన్లకు గ్యారంటీ ఉంటుందా? దేశంలో, ప్రపంచంలో ఏ ప్రైవేటు సంస్థ ఈ గ్యారంటీలతో నడుపుతున్న దాఖలాలు లేవు. మోడీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ఉద్దేశపూర్వకంగానే సమాధి కట్టదలుచుకుంది. దీనిని అనుమతిద్దామా? 
ప్రభుత్వం నిస్సిగ్గుగా, యథేచ్ఛగా ప్రైవేటు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తోంది. వారి లాభాల పెంపుదలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దేశ ప్రజల ప్రయోజనాలను, భద్రతని, కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఈ చర్యల్ని రైల్వేలో ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాలే కాకుండా దేశ సంపదను కాపాడుకోవడానికి దేశభక్తి కలిగిన అన్ని తరగతుల ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించాలి. ఇప్పటికే ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలను సమీకరించి సి.ఐ.టి.యు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ పోరాటం మరింత తీవ్రంగా ఉధ తంగా, ఐక్యంగా కొనసాగితేనే ప్రభుత్వ విధానాల్ని తిప్పికొట్టగలం. దేశ ప్రజల జీవనాడి రైల్వేను రక్షించుకోగలం. లేనిపక్షంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. ప్రజలపై ధరల భారం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు పోతాయి. సామాజిక న్యాయం దెబ్బతింటుంది. రూ.లక్షల కోట్ల ప్రజా సంపద ప్రైవేటు రాబందుల పరమౌతుంది. రైల్వేలను రక్షించుకుందాం-దేశ సంపదను కాపాడుకుందాం.