ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలపై ఆళ్ళగడ్డ పట్టణ ఎస్సై సంచలన వ్యాఖ్యలు

విభారె న్యూస్ :ఆళ్ళగడ్డ: భక్తిశ్రద్ధలతో జరుపుకునే హనుమాన్ జయంతి వేడుకల వేళ ఆళ్ళగడ్డలో ఒక పోలీస్ అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది. ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరే నిమిత్తం సీనియర్ న్యాయవాది, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి స్థానిక డీఎస్పీ గారిని కలిశారు. అయితే ఈ సందర్భంగా అక్కడే ఉన్న పట్టణ ఎస్సై పీరయ్య గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
ర్యాలీ అనుమతి విషయం పక్కన పెడితే, ఎస్సై గారు నేరుగా ఆర్ఎస్ఎస్ మరియు విశ్వహిందూ పరిషత్ సంస్థల క్రమశిక్షణపై విమర్శలు గుప్పించారు. “ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలకు క్రమశిక్షణ లేదు, వారిలో అసలు కంట్రోల్ ఉండదు. వారంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, రాజకీయ పార్టీల ఊరేగింపులలో చాలా క్రమశిక్షణ ఉంటుందని, వారు చాలా పద్ధతిగా నడుచుకుంటారని చెబుతూ ఈ సంస్థలను తక్కువ చేసేలా మాట్లాడటం గమనార్హం.
సాక్షాత్తు డీఎస్పీ గారి ముందే ఒక బాధ్యతాయుతమైన ఎస్సై హోదాలో ఉండి, దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు, క్రమశిక్షణకు, దేశభక్తికి మారుపేరుగా ఉన్న సంస్థలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భక్తిపూర్వకంగా నిర్వహించే ర్యాలీకి అనుమతి కోరడానికి వస్తే, రాజకీయ పార్టీలతో పోలుస్తూ కించపరచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులు ఇలా ఒక వర్గం పట్ల ముందస్తు వ్యతిరేక భావంతో ఉండటం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరియు హనుమాన్ జయంతి ర్యాలీ అనుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనా, ఎస్సై గారి వ్యాఖ్యలు ఇప్పుడు ఆళ్ళగడ్డలో కొత్త వివాదానికి తెరలేపాయి.