దేశ ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారదోలి.. నిరంతరం ప్రకాశం వైపు సాగాలని ఆకాంక్షిస్తూ.. ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు దేశవ్యాప్తంగా లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాఫ్ట్ లేఖ రాశారు. అందరూ ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిడ్ పై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం కేవలం లైట్లు మాత్రమే ఆపమని చెప్పిందని, ఇంట్లోని ప్రిజ్, ఏసీ, టీవీ తదితర వస్తువులను ఉ పయోగించుకోవచ్చని తెలిపారు. వీధి లైట్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వీధి లైట్లు, శాంతి భద్రతల విషయంలో స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆపేయడం వల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలిపోతాయంటూ వస్తున్న పుకార్ల పై కేంద్ర విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. గ్రిడ్ లకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టం చేసింది. ఆ వార్తలు అవాస్తవం: సీఎండీ ప్రభాకర్ రావు మరోవైపు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు లైట్లు ఆపివేయడం వల్ల పవర్ గ్రిడ్ పై ప్రభావం పడుతుందటూ వస్తున్న పుకార్ల పై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. ఒకేసారి లైట్లు ఆపితే గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలతో గ్రిడ్ కు సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు. ఒకేసారి లైట్లు ఆపితే గ్రిడ్ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. “ తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉంది. ఇప్పటికే తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. కరోనా కట్టడికి ప్రధాని మోదీ పిలుపును విజయవంతం చేయండి. ప్రజలు లా డౌన్లో పాల్గొని కరోనా వ్యాప్తిని అరికట్టండి” అని కోరారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నందువల్ల విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని సీఎండీ ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శానిటైజర్ పూసుకొని దీపాలు వెలిగించొద్దు ప్రధాని మోదీ పిలుపు మేరకు లైట్లు ఆపివేసి.. దీపాలు వెలిగించే సమయంలో చేతులకు శానిటైజర్ పూసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. శానిటైజర్ లో ఆల్కహాల్ ఉన్నందువల్ల దానికి మండే గుణం ఉంటుంది. దీంతో దీపాలు వెలిగించే సమయంలో చేతులు కాలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ శానిటైజర్ రాసుకున్న చేతులతో దీపాలు వెలిగించవద్దని నిపుణులు కోరుతున్నారు.