నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని చూసి అందరూ జాలిపడతారు. కానీ వారికి సాయం చేసేవారు కొందరే ఉంటారు. ఆ సాయం దీర్ఘకాలికమైనదైతే బాగుంటుందనుకునేవాళ్లు ఛేంజ్ మేకర్స్ అవుతారు. నాలుగేళ్ల కిందటివరకూ.. వారమంతా ఉద్యోగం,. వారాంతాల్లో పార్టీలనుకునే టిపికల్ ఎన్‌ఆర్‌ఐ ఆమె. కానీ ఒక్క ఘటన ఆలోచనలను మార్చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల జీవితాలను మార్చే పనికి పూనుకుంది. ఆ ‘ప్యూర్’ హార్టెడ్ ఛేంజ్‌మేకర్… శైల తాళ్లూరి. ఇప్పటిదాకా 500 ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించింది. ఈ క్రమంలో తన వ్యక్తిత్వాన్నీ పునర్నిర్మించుకుంది.
‘ప్యూర్'(పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) ఏర్పాటు విచిత్రంగా జరిగింది. కొంతకాలం నుంచి వాట్సాప్‌లో స్కూల్, కాలేజి గ్రూపులు ఏర్పాటుచేసుకునే ట్రెండ్ బాగా మొదలైంది. అలాంటి సమయంలో శైల చిన్ననాటి స్నేహితులంతా కలిసి 2015లో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ‘ప్యూర్’కి చైర్మన్‌గా ఉన్న విజయరామిరెడ్డి వారి ముందు ఒక ప్రపోజల్ పెట్టాడు. ‘మనమందరం బాగానే స్థిరపడ్డాం. కానీ మన స్నేహితుల్లో కొందరు సెటిలవ్వలేదు. ఓ ఆర్గనైజేషన్‌లా ఏర్పాటై వాళ్లకు ఏదైనా సాయం చేస్తే బాగుంటుందేమో’ అన్నాడు. ఆ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన వాళ్లలో శైలు మొదటి అమ్మాయి. ఎందుకంటే వాళ్లంతా అటుఇటుగా ఒకే ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు. అందరికీ ఓపిక ఉంది. ఫ్రీగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ల అవసరాలను గుర్తించి నైపుణ్యాలను పెంచే సాయం కావాలంటే చేద్దాం, ‘అవకాశాలు కల్పిద్దాం’ అనింది. దానికి అందరూ ఓకే అన్నారు. అలా గ్రూప్ ఏర్పాటు చేసుకున్న ఏడాది తరువాత ఒక రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో శైల అమ్మ నుంచి ఆమెకో మెసేజ్ వచ్చింది. దాని సారాంశం – ‘ఒక స్కూల్‌లో 210 మంది పిల్లలున్నారు. వాళ్లకి నోట్‌బుక్స్ ఇస్తావా’ అని. శైల స్నేహితుల వాట్సాప్ గ్రూప్‌లో తల్లి పంపిన మెసేజ్ పెట్టింది. సాయం చేసేందుకు ఐదుగురు ముందుకు వచ్చారు. అంతలోనే వాళ్ల అమ్మ నుంచి ఇంకో మెసేజ్. – ‘వాళ్లకి స్టీల్ ప్లేట్స్ కూడా కావాలట’ అని. అప్పుడు శైల కొద్దిగా చిరాగ్గా… ‘ఎన్ని అడుగుతారు. ఏదో ఒకటి అడగమను’ అనేసి నిద్రపోయింది. తన మాటలను వాళ్లకు చెప్పారు అమ్మ. ఆ స్కూల్ వాళ్లు ఎనిమిదో తరగతి పిల్లల్ని ”మనకు ఏదో ఒకటి మాత్రమే సాయం చేయగలరట. పుస్తకాలా? ప్లేట్లా? ఏవి అడుగుదాం” అని అడిగారట. దానికి పిల్లలు ‘ప్లేట్లు ఉన్నవి వాడుకుందాం. పుస్తకాలు ఇవ్వమ’నండి అన్నారట. శైల పొద్దున్నే లేచి అమ్మకి ఫోన్ చేసి రాత్రి ఏదో చిరాకులో అలా మాట్లాడానని చెప్పబోతుంటే… అమ్మ ‘ఆ 210 మంది పిల్లలు స్కూల్‌కి వచ్చి చదువుకుంటున్న మొదటి తరం గిరిజన విద్యార్థులు. ఆ పిల్లలు మధ్యాహ్నం స్కూల్లో తిన్నదే భోజనం.
అంతమంది పిల్లలకు 40 ప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. ఆకలి తట్టుకోలేక ఒకరిద్దరు పిల్లలు కలిసి ఒకేసారి, ఒకటే ప్లేట్లో తింటున్నారట’ అని చెప్పారు. అది విన్నాక ఆ ముందు రోజు ఎంత పొగరుగా మాట్లాడిందో అర్థమైంది. తరువాత వాట్సాప్ గ్రూపులో అదే విషయం పెట్టింది శైల. వాళ్లడిగిన పుస్తకాలు, ప్లేట్స్ ఇవ్వడమే కాకుండా ఆ స్కూల్‌కి పెయింట్స్ వేయించారు. బెంచీలు, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయించారు. ఈ మధ్యనే డిజిటల్ క్లాస్‌రూమ్ ఏర్పాటు చేసి రూమ్స్ కట్టించి, గ్రిల్స్ పెట్టించారు. ఇంతకీ ఆ స్కూల్ పేరు, అదెక్కడ ఉందంటే.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో బాసిత్‌గనర్ స్కూల్. కొన్నాళ్లకు ఆ స్కూల్ సమీపాన ఉన్న రింగిరెడ్డిపాలెం స్కూల్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. అప్పుడు శైల తన మిత్రులను కలిసి ”సంస్థ ఏర్పాటుచేద్దాం అన్నారు కదా. ఇప్పుడు మొదలుపెడదామ”ని అడిగింది. దాంతో ఆరుగురు ముందుకొచ్చారు. శైల మిత్రులతో కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసుకున్నారు.
ప్యూర్‌తో అక్కడా… ఇక్కడా…
ఆలోచన అయితే వచ్చింది కానీ ఎలా ఏర్పాటుచేయాలో తెలియలేదు. శైల యుఎస్ సిటిజన్ కావడం వల్ల అధికారికంగా ఇండియాలో ఏమీ చేయలేని పరిస్థితి.. చెప్తే నాటకీయంగా అనిపించొచ్చు కానీ.. రాత్రింబవళ్లు ఎలా ఏర్పాటుచేయాలని నెట్‌లో జల్లెడ పట్టింది.. దాని గురించి చర్చల మీద చర్చలు చేసేవాళ్లు. ఆ చర్చల్లో కొందరు సమయం కేటాయించలేమని విరమించుకున్నారు. మిగిలిన వాళ్లు మొదలుపెట్టాం. వాళ్లంతా భారతీయ పౌరసత్వం ఉన్న వాళ్లే. అక్కడ ఉంటున్న వాళ్లే. కేవలం రవాణా ఖర్చులు మాత్రమే తీసుకుని పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ‘ద్రోణ’ అనే పేరు అనుకున్నారు. ఎందుకో ఆ పేరుతో అంతగా కనెక్ట్ అవ్వలేకపోవడంతో ట్రైబల్ పిల్లలకోసం చేస్తున్న పనికి ఆ పేరు బాగోదు అనిపించింది. అంతర్జాతీయంగా కూడా కనెక్ట్ అయ్యేలా ఉండాలనిపించింది. అప్పుడు పుట్టిందే ‘ప్యూర్ – పీపుల్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఎడ్యుకేషన్. సంస్థ అయితే ఏర్పాటు చేశారు. కానీ అందరికీ ఎవరి ఉద్యోగాలు వాళ్లకి ఉన్నాయి. అందుకని నిర్వహణ బాధ్యతలు చూడమని శైల వాళ్ల అమ్మని అడిగింది. శైల నెల్లూరులో ఉన్నప్పుడు ‘విశ్వభారతి’లో టీచర్‌గా పనిచేసింది అమ్మ. వాట్సాప్ గ్రూప్ ఏర్పడింది కూడా అక్కడి బాల్య స్నేహితులతోనే. అందుకని ఆవిడని అందరూ కలసి ‘రెండేళ్లు ప్యూర్ సంస్థకి పనిచేయమ’ని అడిగారు. అలా ఆమెను మేనేజింగ్ డైరెక్టర్‌గా పెట్టారు. యుఎస్‌లో నలుగురు డైరెక్టర్లతో జూన్‌లో రిజిస్టర్ చేశారు. ఇక వాళ్లు పెట్టుకున్న మొదటి నియమం ఎవరినీ నేరుగా ఫండ్స్ అడగకూడదు అని..
చేయాలనుకుంటున్నది మంచి పని. ఎంతోమందికి సాయం చేయాలని ఉంటుంది. కానీ ఎలా? ఎక్కడ? చేయాలో తెలియక ఆగిపోయి ఉండొచ్చు. వాళ్లందరినీ కలిపేందుకు సోషల్ మీడియాను ఉపయోగించాలనుకున్నారు. అవసరం గురించిన వివరాలతో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. దానికి ఎవరు కనెక్ట్ అయితే వాళ్లు ముందుకొచ్చి సాయం చేస్తారనే కాన్సెప్ట్. శైల తన ఫేస్‌బుక్ నెట్‌వర్క్ పెంచుకుంది. ప్యూర్‌కి నిధులు తన ఫేస్‌బుక్ వాల్ మీద నుంచే 95 శాతం వరకు సేకరించింది.
తమ వంతు ప్రయత్నం
డబ్బులు రావడం ఆలస్యం అదే వారంలో పని మొదలవుతుంది. అందుకే రెండేళ్లలో పాతికవేల మంది పిల్లల్ని, 150 స్కూల్స్‌ని చేరుకోగలిగారు. ప్యూర్ సక్సెస్‌లో తన కెంత క్రెడిట్ ఉందో… వాళ్ల అమ్మ సంధ్యా గోళ్లమూడిది కూడా అంతే ఉంది. మొదట్లో తెలంగాణలోనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేస్తున్నారు. వాళ్ల లక్ష్యం ఒకటే… పిల్లలు స్కూల్‌కెళ్లి చదువుకునేందుకు ఎదురయ్యే అడ్డంకులను తొలగించడమే. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..”అదెలాగో ఒక ఉదాహరణ చెప్తా – మహబూబ్‌నగర్ జిల్లా తాడిపర్తి గ్రామంలోని స్కూల్‌లో 40 మంది పిల్లలు పక్క ఊళ్ల నుంచి రోజుకి ఐదు కిలోమీటర్లు నడిచి వస్తారు. వాళ్లకి సైకిళ్లు ఇప్పించాం. అలానే మొగిలిచర్లలో కూడా సైకిళ్లు ఇప్పించాం. ఆ సైకిళ్లను పదో తరగతి పూర్తయ్యాక స్కూల్‌లోనే ఉంచితే తరువాత వచ్చే పిల్లలకు ఉపయోగపడతాయని అనుకున్నారట వాళ్లంతా. ఆ నిర్ణయం ఎంత గొప్పదో కదా! సర్కిల్ ఆఫ్ గివింగ్. అలాగే కాలేజీలో చదువుకోవాలనుకునే అనాథ పిల్లలకి, ఒంటరి తల్లుల పిల్లలకి నెలవారీ ఖర్చులు ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పుడు 71 మంది పిల్లలు ‘ప్యూర్’ స్పాన్సర్‌షిపలో ఉన్నారు. వాళ్లలో ఒక అబ్బాయి ఎంబిబిఎస్ చదువుతున్నాడు. ఇద్దరు ఇంజనీరింగ్, మిగతా వాళ్లు డిగ్రీ చదువుతున్నారు. ఐదుగురు దివ్యాంగులకి ఇంపోర్టెడ్ బయో ప్రొస్తటిక్ లింబ్స్ పెట్టించాం” అంటారామె.
అవగాహన ముఖ్యం
పిల్లల చదువుతో పాటు అమ్మాయిల మెనుస్ట్రువల్ హైజీన్ కోసం ‘ప్యూర్ ఫెమ్మె’ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ సంస్థ మొదలుపెట్టిన రోజుల్లో ”ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది కదా. ఎందుకని మన దేశంలో అమ్మాయిలు తగ్గిపోతున్నారు” అంటున్నారని అడిగింది. అప్పుడు తన మనసుపై చెరిగిపోని సమాధానం చెప్పారు. ఎంత పేదరికంలో ఉన్నా అబ్బాయిని ప్రైవేటు స్కూల్‌కి పంపిస్తారు. అదే అమ్మాయిల్ని అయితే ఉచిత విద్య కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకి పంపిస్తారని చెప్పారు. వీళ్లకేం చేయగలం? అని ఆలోచించింది. స్కూల్స్‌లో బాత్రూమ్‌లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మెనుస్ట్రువల్ క్లాత్స్ అందిస్తున్నారు. కొన్ని హైస్కూల్స్‌లో ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చాక బడికి రావడం మానేస్తున్నారు. నెలకి మూడు నుంచి ఐదు రోజులు గైర్హాజరు అవుతున్నారు. ఇందుకు కారణాలనేకం… శానిటరీ ప్యాడ్స్, క్లాత్స్ అందుబాటులో లేకపోవడం. పోషకాహారం సరిగా అందక అధిక రక్తస్రావం కావడం వంటివి ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి, వాట్సాప్‌లో మాట్లాడితే 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వాళ్లంతా కలిసి మెనుస్ట్రుపిడియా బుక్స్ అందిస్తున్నారు. వెండింగ్ మెషిన్లు, నాప్‌కిన్స్ డిస్ట్రాయ్ చేసే ఇన్సినరేటర్లు ఏర్పాటుచేస్తున్నారు. చౌకగా శానిటరీ నాప్‌కిన్లు అందించడం… అవి కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా చూడడం వంటివి ‘ప్యూర్ ఫెమ్’ ద్వారా చేస్తున్నారు. శానిటరీ హైజీన్ గురించి టీచర్లలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. పిల్లల కోసం ఇంటరాక్టివ్ వర్క్‌షాప్స్ ఏర్పాటుచేస్తున్నారు. ఫెమ్ అండ్ హైజీన్ తరపున 2020 లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర లక్షల మంది అమ్మాయిలను చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.”
నేను పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న బ్యాంకులో పనిచేసేవారు. అందుకని ఏ ఊళ్లో ఐదేళ్లకి మించి ఉండేవాళ్లం కాదు. అలా నెల్లూరులోని విశ్వభారతి స్కూల్లో నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివాను. ఆ స్కూల్ స్నేహితులతో కలిసే ‘ప్యూర్’ ప్రారంభించాను. ఏడో తరగతి తరువాత హైదరాబాద్‌కి వచ్చేశాం. నాన్న ఢిల్లీ, కడప తిరిగినా మేము హైదరాబాద్‌లోనే ఉండిపోయాం. ఈవ్ టీజింగ్‌ను తొమ్మిదో తరగతి నుంచే ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను ట్యూషన్‌కి తీసుకెళ్లేందుకు అమ్మ బొడ్లో కత్తి పెట్టుకుని వచ్చేవారు. నా చదువు డిస్టర్బ్ కావడానికి అది కూడా ఒక కారణం. డిగ్రీ పూర్తవ్వగానే పెళ్లి చేశారు. 1998లో యుఎస్ కి వచ్చేశాను. అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. సొంతంగా రెండు స్టార్టప్ కంపెనీలున్నాయి. నాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన కూడా ఐటి మేనేజర్. వాళ్లది వరంగల్ జిల్లా ఖాజీపేట్. అంటారు శైల…


