అయ్యో పాపం….. ఈ పాపం ఎవరిది?

కాన్పూర్‌: ఏకంగా 57 మంది బాలికలకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాన్పూర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కాన్పూర్‌ ప్ర‌భుత్వ బాలిక‌ల ఆశ్ర‌య గృహంలో 57 మంది బాలిక‌ల‌కు క‌రోనా సోకినట్లు తెలిసింది. వీరిలో ఐదుగురు బాలికలు గ‌ర్భ‌వ‌తులు కావడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వీరిలో ఒకరు హెచ్ఐవీ తో   బాధ పడుతున్నట్లు తెలిసింది. సమగ్ర విచారణ అనంతరం ఈ సమాచారం వాస్తవమేనని అధికారులు ధ్రువీక‌రించ‌డంతో స్థానికంగా క‌ల‌వ‌రం మొద‌లైంది.

ప్ర‌స్తుతం ఈ బాలికల ఆశ్ర‌య గృహాన్ని మూసేసిన ప్ర‌భుత్వం అక్కడి సిబ్బందిని క్వారంటైన్‌కు త‌ర‌లించింది. ఈ బాలికల ఆశ్రయ గృహంలో ఏడుగురు బాలికలు గ‌ర్భిణులు ఉన్నార‌ని,  అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బ్ర‌హ్మదేవ్ రామ్ తివారీ ఆదివారం సాయంత్రం మీడియాతో వెల్ల‌డించారు. ఆశ్ర‌యం పొందేటప్పటికే  ఈ బాలిక‌లు గ‌ర్భ‌వ‌తుల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. జిల్లా ఎస్పీ సైతం ఇదే విష‌యాన్ని ధృవీకరించారు. ఈ ఆశ్రమ గృహంలోకి పురుషులు ప్రవేశించే అవకాశమే లేదని, ప్రస్తుతం దీనిపై విచారణ 

కొనసాగుతున్నదని ఆయన తెలిపారు.