ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్)::ఆళ్లగడ్డలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజుల లేఖర్లు నిరసన నిర్వహించారు.ప్రభుత్వం దస్తావేజులు తయారు చేసే ప్రక్రియను, మరియు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలను గ్రామ సచివాలయానికి అప్పజెప్పడం వలన తాము జీవనోపాధి కోల్పోతామని, తమ కుటుంబాలు వీధిన పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వకాలం నుండి లేఖరుల ద్వారానే దస్తావేజులు తయారు చేయబడుతున్నాయని, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వారు తెలిపారు. అనాదిగా వస్తున్న దస్తావేజు లేఖరుల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వారి జీవనోపాధి పై దెబ్బ కొట్టడం భావ్యం కాదని లేఖర్ల యూనియన్ సభ్యులు వాపోయారు. దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వలన రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం ఉందని,ఇప్పటికైనా పునరాలోచన చేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తాము ఆందోళన ఉధృతం చేస్తామని యూనియన్ సభ్యులు తెలిపారు.