కోవిడ్ ఆసుపత్రుల సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి :: ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.

అమరావతి: కొవిడ్ బారినపడి కోలుకున్న వారినుండి‌ ఆస్పత్రుల  సేవలపై  ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు మొదలగు వాటిపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 104, 14410 కాల్‌ సెంటర్లు శ్రద్ధగా పనిచేయాలన్నారు. నంబర్ల పనితీరును అధికారులు అను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. కాల్‌సెంటర్‌ సేవలపై ప్రజలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రులు, కొవిడ్‌ కేంద్రాల్లో రోగులకు అందించే ఆహారం మరియు పారిశుద్ధ్యంపై సీఎం ఆరా తీశారు. ప్రభుత్వం సూచించిన ఆహారం మెనూ కచ్చితంగా అమలు చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. టెలీమెడిసిన్‌ కింద మందులు తీసుకున్నవారి పరిస్థితి గురించి విచారించి తెలుసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.