అమరావతి :: ఆంధ్ర రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరగడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనాపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండు వారాలలో రాష్ట్రంలో కరోనా వృద్ధిరేటు అధికంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా మరణాలు లోను రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవని చెప్పారు. ముఖ్యంగా అంబులెన్సులో, ఆస్పత్రులలో శానిటేషన్ ఎంతో అవసరమని, ఎక్కువ మంది రోగులను ఒకే అంబులెన్స్ ల తీసుకు వెళ్లడం వలన వ్యాధి తీవ్రతకు కారణం అవుతుందని ఆందోళన వెలిబుచ్చారు. క్వారంటైన్ కేంద్రాల్లో మెరుగైన వసతులు ఉంటే రోగులు మరింత త్వరగా కోలుకుంటారని చెప్పారు. కరోనాతో చనిపోయిన వారికి తగిన రీతిలో అంతిమ సంస్కారాలు జరగక పోవడం విచారకరమన్నారు. అత్యవసర సేవల కోసం రోగులు ఎదురు చూడాల్సి రావడం బాధాకరమన్నారు. సమాజాన్ని కరోనా బారినుండి కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్రంట్ లైన్ వారియర్ ల త్యాగాలు సేవలు వెలకట్టలేనివి అన్నారు. చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్ లకు ఆగస్టు 15న ఘనంగా నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.