
నంద్యాల::(విభారె న్యూస్): నంద్యాలలో అనూహ్యంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 106 పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. 20 రోజులలో ఐదుగురు మృతి చెందారు. నంద్యాల జీవిత బీమా కార్యాలయ ఉద్యోగులకు, భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్, నూనెపల్లె బ్రాంచ్ లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ మూడింటిని మూసివేశారు. నిరంతరం ప్రజలతో మమేకమై ఉండే పోలీస్ శాఖ వారికి కూడా కరోనా సోకడంతో పోలీసు అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మరణించారు. వన్ టౌన్ లో ఒక కానిస్టేబుల్ కు, టూటౌన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ కు కరోనా సోకడంతో పోలీసులకు విధి నిర్వహణ కష్టంగా మారింది. ముఖ్యంగా బ్యాంకులు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో రారాజు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలతో అనుసంధానమై ఉండుటవలన ఎప్పుడూ విపరీతమైన రద్దీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగ నిర్వహణ చేయాలంటే అధికారులు భయపడుతున్నారు. వ్యవసాయ రుణాల రెన్యువల్ వాయిదా వేయక పోవడం వలన, వడ్డీ మాఫీ కోసం రైతులు అధిక సంఖ్యలో బ్యాంకులలో గుమికూడడం వలన, బ్యాంకులలో రద్దీ పెరుగుతోంది. దీనితో సులభంగా కరోనా వ్యాప్తి జరుగుతోంది. అధికారులు ఎన్ని సూచనలు చేసినా ప్రజలు మాత్రం సామాజిక దూరం పాటించడం లేదు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై, ప్రభుత్వ అధికారులు చెప్పిన సూచనలు పాటించకపోతే, సమీప భవిష్యత్తులో నంద్యాల ప్రజలు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం నుండి లాక్ డౌన్ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.