కార్మికులకు కరోనా విధులతో పడకేసిన పారిశుధ్యం
-నగరంలో పెరుగుతున్న దోమల బెడద -ఒక పక్క కరోనా మరో పక్క దోమకాటు -ఇతర రోగాల బారిన పడే అవకాశం -కరోనా విధుల్లో ఎంటమాలజీ విభాగం -పరిమితంగానే ఫాగింగ్.. – మురికివాడల్లో సమస్యలు అధికం
హైదరాబాద్: కరోనా భయాందోళనలతో చాలామంది కార్మికులు విధులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివాసాలున్నవారు తమ స్వగ్రామాలకు వెళ్లి తిరిగి రాలేదు. గ్రామాల నుంచి వారిని రానీయడం లేరని, నగరానికి వెళ్లి ఊర్లోకి కరోనా తీసుకురావద్దని సంబంధిత గ్రామస్థులు వారిని అక్కడే నిలువరించినట్లు సమాచారం. దీంతో దాదాపు యాభై శాతం సిబ్బంది మాత్రమే పనిచేస్తుండటంతో ఆమేరకు ప్రభావం ఉంది. మరోవైపు దోమల నివారణ మందుకంటే తమకు కరోనా సోకకుండా ఉండేందుకు హైపోక్లోరైట్ పిచికారీనే కావాలని రాజకీయనేతల నుంచి పలువురు వీఐపీల వరకు కోరుతుండటంతో అధికారులు సైతం వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లోనూ వీటిని కోరుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీని చేపట్టినట్లు చెబుతోన్న జీహెచ్ఎంసీ నిత్యం జరగాల్సిన దోమల నివారణ చర్యల్ని విస్మరించింది. చాలా ప్రాంతాల్లో ఫాగింగ్, తదితర కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో స్లమ్స్ లోనే కాకుండా పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లో దోమల తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు దోమల స్వైర విహారం ఇబ్బందులు పెడుతోంది. నివారణ చర్యలు చేపట్టకపోతే త్వరలోనే నగరంలో దోమ కాటు తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీలో దోమల నివారణ కోసం పనిచేస్తున్న ఎంటమాలజీ విభాగంలో ఒక్కో యూనిట్‌కు 18 మంది కార్మికులు, ఒక సూపర్వైజర్ వంతున 125 టీముల్లో దాదాపు 2375 మంది పనిచేస్తున్నారు. గతంలో డివిజన్ కు ఒకటి చొప్పున 150 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు మాత్రమే ఉండగా కొద్దికాలం క్రితం హైకోర్టు మందలింపులతో వాటిని 300కు పెంచారు. వీటిల్లో కొత్తవి అసలు వినియోగించడం లేరు. పెద్ద మెషిన్లు కూడా మరో 50 కొన్నారు. వెరసి దాదాపు 63 పెద్ద మెషిన్లున్నాయి. మొత్తం 150 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లలో 130-140 వరకు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలనేకం. దోమల వల్ల వచ్చే మలేరియా, తదితరమైన వ్యాధులు నయమవుతాయి కానీ.. కరోనా వస్తే ప్రాణాంతకమనే తలంపుతోనూ చాలామంది హైపోక్లోరైట్ నే కోరుతున్నారు. ఉన్న సిబ్బందిని ఆ కార్యక్రమాలకు వినియోగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎంటమాలజీ విభాగం సైతం రెగ్యులర్ గా నిర్వహించే దోమల నివారణ చర్యల్ని మానుకుంది. దీంతో స్లమ్స్ తో పాటు పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లోనూ దోమలు క్రమేపీ పెరగుతున్నాయి. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ఇవి మరింత తీవ్రమయ్యే ప్రమాదమున్నందున దోమల నివారణ పై కూడా అధికారులు ద్రుష్టి సారించాలని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు హైపోక్లోరైట్ స్ప్లే కూడా అన్ని ప్రాంతాల్లోనూ జరగడం లేదని, పరిమిత ప్రాంతాల్లోనే జరుగుతోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి రొంపిలో బల్దియా దోమల విభాగం నల్ల బజారులో డీజిల్, రసాయనాల విక్రయం రోగాల బారిన బస్తీలు, కాలనీల వాసులు నగరం పై దోమలు యుద్ధం ప్రకటించాయి.. బస్తీలు, కాలనీల్లో సాయంత్రమైతే చాలు రోడ్డు పై నిలవలేని దుస్థితి తయారైంది.. ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. దోమ కాటుతో డెంగీ, మలేరియా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ దోమల నివారణ విభాగం అలసత్యం, అవినీతి వ్యవహారమే అందుకు కారణమవుతోంది. దోమలు ఉత్పత్తి కాకుండా చల్లాల్సిన మందును, ఫాగింగ్ యంత్రాలకు ఉపయోగించాల్సిన డీజిలను అధికారులు నల్ల బజారుకు తరలించి ప్రజలను రోగాల బారిన పడేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏళ్లుగా జరుగుతోన్న ఈ దందాకు కేంద్ర కార్యాలయమే అండదండలు అందిస్తోందని, ఏటా రూ.10 కోట్లు ఖర్చవుతున్నా ఫలితం కనిపించట్లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిలో కోటికి పైగా జనాభా ఉన్నారని అంచనా. బస్తీలు, కాలనీల్లో పెద్ద సంఖ్యలో జనం నివాసముంటున్నారు. నాలాలు, మురుగు కాలువలు, తటాకాల చుట్టూ జీవనం సాగిస్తున్నారు. సరిగ్గా అక్కడే దోమలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో బల్దియా ఎంటమాలజీ విభాగం క్షేత్ర స్థాయిలో దోమల తీవ్రత అధికంగా ఉన్న పలు ప్రాంతాలను గుర్తించింది. వాటితో పాటు సమీప కాలనీలు, బస్తీల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించామని, వైద్య శిబిరాలు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. దోమల వ్యాప్తి అందుకు కారణం బల్దియా అలసత్వమేనన్న విమర్శలున్నాయి. ప్రధాన నగరంలోని జియాగూడ, దత్తాత్రేయనగర్, ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్, బర్కత్ పుర, కాచిగూడ, గోల్నాక వంటి ప్రాంతాల్లో వ్యాధుల ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళనకు తావిస్తోంది. ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు… గ్రేటర్ లో డివిజన్ కు ఒకటి చొప్పున 150 డివిజన్లకు 150 పోర్టబుల్ ఫాగింగ్ యంత్రాలున్నాయి. సిబ్బంది ద్విచక్ర వాహనం పై తిరుగుతూ ఆ యంత్రాలతో దోమల మందును వ్యాపింపజేస్తారు. మరో 13 నాలుగు చక్రాల వాహనం పై అమర్చిన పెద్ద ఫాగింగ్ యంత్రాలున్నాయి. డీజిల్ ట్యాంకు, ఇతర రసాయనాలతో కూడిన సరంజామాతో ఆయా వాహనాలు నిత్యం సర్కిళ్లలో మందు చల్లుతూ ఉండాలి. పని చేస్తున్నట్లు అధికారులు బిల్లులు మంజూరు చేసుకుంటున్నారే తప్ప సంబంధిత ఫాగింగ్ యంత్రాలు ఎక్కడా కానరావడం లేదు. అలా దోపిడీకి ఆసరాగా మారాయి. వెరసి.. ఏడాదికి రూ.10 కోట్ల వరకు వెచ్చిస్తున్నా నగరవాసులకు దోమలతో తిప్పలు తప్పట్లేదు. సిబ్బంది పేరుతో మాయాజాలం దోమల విభాగంలో 2,300 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు. 18 మంది ఓ బృందంగా ఏర్పడి నగర వ్యాప్తంగా వార్డుల్లో దోమల నివారణ చర్యలను అమలు చేస్తుంటారు. 126 మందికి పైగా ఉన్న సూపర్వైజర్లు సిబ్బందితో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డివిజన్లలో పని చేయించాలి. ఉదయం, మధ్యాహ్నం బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలి. నకిలీ వేలిముద్రలు, ఇతర అడ్డదారులు తొక్కిన పలువురు సూపర్వైజర్లు పనిలో లేని సిబ్బందినీ ఉన్నట్లు చూపిస్తున్నారు. ఫలితంగా వీధులు, కాలనీల్లో ఇంటింటికి తిరిగి దోమల మందు పిచికారీ చేసే కార్యక్రమం మసకబారింది. సాయంత్రమైతే చాలు దోమలు జనావాసాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. నల్లబజారుకు మందు, డీజిల్.. ఫాగింగ్ యంత్రాలకు ఇచ్చే డీజిల్ కూపన్లను పలువురు సిబ్బంది పెట్రోలు బంకుల్లో విక్రయిస్తున్నారు. దాంతో రసాయనాల వినియోగం కేటాయించిన మోతాదులో ఉండట్లేదు. కేవలం నాలుగో వంతు దోమల మందునే పిచికారీ చేస్తున్నారు. ఇలా అడ్డదారిలో మూటగట్టుకున్న సొమ్ములో సూపర్వైజర్లు కమీషన్లతో ఉన్నతాధికారుల నోళ్లు మూయిస్తున్నారనే విమర్శలున్నాయి.