ఒక్క రోజే 1480 మరణాలు.. న్యూయార్క్ లో ప్రతి 2 నిమిషాలకో మరణం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్కరోజే ఆ దేశంలో రికార్డు స్థాయిలో 1480 మంది మరణించినట్లు జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటి ట్రాకర్ వెల్లడించింది. గురువారం రాత్రి 8:30 గంటల నుంచి శుక్రవారం రాత్రి అదే సమయానికి 1480 మంది మరణించారని గుర్తించింది. దీన్నిబట్టి అమెరికాలో వైరస్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి విజృంభణతో ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు అగ్రరాజ్యంలో మృతిచెందినవారి సంఖ్య 7,406కి చేరింది. బాధితుల సంఖ్య 2,77,828గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య 10,98,848కి చేరగా మరణాల సంఖ్య 58,871కు చేరుకొంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకుల వణికిపోతుంది. ఇప్పటికే అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 2లక్షల 50వేలు దాటింది. మరణాలు 8వేలకు చేరువయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 60వేల ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి.. అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. ఎంతలా అంటే న్యూయార్క్ లో ప్రతి రెండు నిమిషాలకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. అయితే అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని అక్కడి అధికారులు చెపుతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లోనే కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య అత్యధికంగా నమోదైందని పేర్కొంటున్నారు. ప్రజలు సాధారణ మాస్కులు ధరించాలి: ట్రంప్ అమెరికాలో ఒక పక్క మరణాల సంఖ్య పెరుగుతుండగా మరోపక్క బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరో నాలుగు వారాల పాటు ఇళ్లకే పరిమితవ్వాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సూచించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సూచించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, అవి కూడా సాధారణమైనవి లేదా ఇళ్లల్లో తయారు చేసుకున్నవి ఉండాలన్నారు. మెడికల్ మాస్కులు, ఎన్-95 మాస్కులు ధరించారదని ప్రజలకు సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవారికి, వైద్య సిబ్బందికి ఆ మాస్కులు ఉపయోగకరమని పేర్కొన్నారు. అలాగే మాస్కులు ధరించినంత మాత్రానా సామాజిక దూరం పాటించకపోవడం, ఇళ్లల్లో ఉండకుండా బయటకు రావడం లాంటివి చేయకూడదని హెచ్చరించారు. తాజా సమాచారం ప్రకారం ఇతరుల్లో వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. వారితో సన్నిహితంగా ఉన్నవారికి వైరస్ వ్యాపిస్తుందని సీడీసీ పేర్కొంది.