ఏపీలో రాజధాని ప్రకటనల నిర్ణయం వెనుక గులాబీబాస్!
- -ఏపీలో కొలిక్కిరాని 3 రాజధానుల వ్యవహారం
- -జగన్ నిర్ణయాల వెనుక తెలంగాణ సీఎం
- -విశాఖను రాజధానిగా చేయాలని శారదా పీఠాధిపతి ఒత్తిడి
- -అమరావతి రాజధాని అయితే బాబుకే పేరు వస్తుంనే భావన
- -విశాఖలో భూములు తక్కువకే కొనాలనే యోచన
- -అమరావతే రాజధానిగా ఉండాలని కేంద్రం సూచన..
- -ఇప్పటికే కోట్లాది నిధులు ఖర్చయ్యాయని బీజేపీ మండిపాటు
- -తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదనుకుంటున్న ఏపీ సర్కార్
హైదరాబాద్:
అమరావతిగా రాజధాని మార్పు తథ్యం అని వైసీపీ అధికారంలోకి రాగానే ఫిక్స్ అయిపోయింది. అయితే మార్చితే ఎక్కడకు మార్చుతారు, దొనకొండకే రాజధాని మార్చబోతున్నారా? హైకోర్టు విషయంలో రాయలసీమను పరిగణలోకి తీసుకుంటారా? ఇలా రకరకాల ఊహాగానాలు ఉండేవి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు రాజకీయ ప్రయోజనాలు కూడా తోడై ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. అయితే జగన్ రాజధానులు మూడు ఉంటాయని చేసిన ప్రకటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ సలహా పాటించినట్లు కనపడుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా చంద్రబాబును, టీడీపీని ఎంత ఇరుకున పెట్టారో అందరికీ తెలుసు. సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో పార్టీ నష్టం, జై తెలంగాణ అంటే ఆంధ్రాలో పార్టీకి నష్టం అనే విధంగా ఎత్తుగడలు వేశారు. ఆ ఎత్తుగడలతోనే చంద్రబాబు టీడీపీ ప్రతిభను తెలంగాణలో కోల్పోవలసి వచ్చింది. టీడీపీ అంటే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేలా ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చారు సీఎం కేసీఆర్.
ఇప్పుడదే ఫార్మూలాను తన మిత్రుడైన సీఎం జగన్‌తో కూడా అప్లై చేయించారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేస్తూ అమరావతిలో రాజధాని ఉంటూనే, కర్నూల్‌తో పాటు విశాఖను కూడా రాజధానిగా చేయబోతున్నాం అంటూ ప్రకటన చేశారు. దీంతో అమరావతిని తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇప్పుడ రాజకీయంగా ఇబ్బందికర పరిణామం ఎదురవుతోంది. విశాఖకు రాజధాని వద్దు అని అనలేడు. ఒకవేళ అలా అంటే.. ఉత్తరాంధ్రలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. చంద్రబాబే అడ్డుకుంటున్నారని జగన్ ప్రచారం చేస్తారు. కర్నూల్‌కు హైకోర్టు వద్దు అని కూడా చంద్రబాబు అనలేరు. అమరావతిలోనే కొనసాగాలి అని ప్రకటన వస్తే రాయలసీమలో టీడీపీకి ఇబ్బంది. దీంతో ప్రస్తుతం టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఒకప్పటి తెలంగాణ ఉద్యమ ఇరకాట పరిస్థితిని తలపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో లాగా ఎదో ఒక స్టాండ్ తీసుకుంటే మరో చోట పార్టీకి ఇబ్బందులు తప్పవు. అలాగని ఆస్వాదించినా ప్రస్తుత అమరావతిలో ఇబ్బంది తప్పదు. దీంతో ముందు నుయ్యి-వెనుక గొయ్యిలా తయారైంది చంద్రబాబు పరిస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ సలహాతో వైఎస్ జగన్ వేసిన తాజా వ్యూహాన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాగా రాజధానిని విశాఖకు తరలింపు విషయంలోనూ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచన కూడా లేకపోలేదని కొందరి అనుమానం. గతంలో చంద్రబాబును రాజధాని విషయంలో శారదా పీఠాధిపతి బాహాటంగానే విమర్శించారు. పైగా వాస్తు పరంగా అమరావతిని వ్యతిరేకించారు. ఎప్పటికైనా ముంపుకు గురవుతుందని హెచ్చరించడం గమనార్హం. అయితే కేసీఆర్‌కు శారదాపీఠాధిపతిపై అపారమైన భక్తిభావం ఉందన్న సంగతి విదితమే. ఆయన సూచనల మేరకే హైదరాబాద్‌లోనూ సచివాలయం మార్పులు, ప్రాజెక్టుల శంకుస్థాపన ముహూర్తాలు, యజ్ఞయాగాలు చేస్తారన్న సంగతి అందరికీ తెలుసు. జగన్ ముఖ్యమంత్రి కావడానికి కూడా శారదాపీఠాధిపతి చేసిన పూజలు అనుకుంటుంటారు అందరూ. అందుకే ఒక పక్క చంద్రబాబును ఇరుకున పెట్టినట్లు అవుతుంది మరో పక్క సెంటిమెంటు పరంగానూ జగన్‌కు కలిసొస్తుందనే నమ్మకంతోనే మూడు రాజధానుల ప్రకటన చకచకా జరిగిపోయాయి. అయితే గత వారం రోజులుగా విశాఖపట్నం రాజధానికి అనువైన ప్రాంతంగా దాదాపు ఖరారు కానున్నదనే సంకేతాలు వస్తున్నాయి.
ఏపీలో కొనసాగుతన్న రాజధాని తరలింపు..మూడు రాజధానుల ప్రతిపాదనల అంశంలో అందరూ కేంద్రం వైపు చూస్తున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో బీజేపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు చేస్తుండటం.. జాతీ య స్థాయిలో ప్రభుత్వ ఆలోచనలను తప్పు బడుతుండటంతో..కేంద్రం వైఖరి ఏంటనే దాని పైన రాష్ట్ర ప్రభుత్వంలోనూ చర్చ సాగుతోంది. కేంద్ర పెద్దల అనుమతి లేకుండా ఏపీ బీజేపీ నేతలు దీక్షలు చేయరని .. ఇక్కడ అమరావతికి మద్దతుగా నిలవరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..తాను నేరుగా ప్రధాని మోదీ..అమిత్ షా ను కలిసి తమ ఆలోచనల వెనుక అసలు కారణాలు వివరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ వారంలోనే ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అమరావతికే బీజేపీ మద్దతు..!
ఏపీ ప్రభుత్వం అమరావతి నుండి రాజధానిని తరలించాలనే ప్రతిపాదన పైన ఏపీ బీజేపీ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయాణ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మౌన దీక్ష్ చేయగా..పార్టీ నేతలు రైతుల నిరసనల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దీనిని వ్యతిరేకంచటమే కాకుండా..తాజాగా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని నగరాన్ని వేరే చోటకు తరలించడానికి వీల్లేదని బీజేపీ అధిష్ఠానం స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు సమాచారం.
కమలనాధుల ఆదేశాలతోనే ఇక్కడ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని, దరిదాపుగా రూ.9 వేల కోట్ల పనులు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అమరావతిలో రాజధాని ఉంటేనే రాష్ట్రం అభివద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ పెద్దల ఆదేశాల మేరకే ఆయన శుక్రవారం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌనదీక్షకు కూర్చున్నారు. ఇక బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాజధాని మార్పుపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర పెద్దలకు నివేదించే పనిలో ఉన్నారు. ఒక ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం రైతులు భూములిస్తే.. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చి అర్ధాంతరంగా రాజధానిని మార్చేస్తే.. ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనే భావనలో బీజేపీ అగ్ర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాజధాని ప్రాంత రైతులు సైతం ప్రధాని మోదీ ఫొటోలతో నిరసనలు కొనసాగిస్తున్న విషయం కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా గమనిస్తోంది.
ఢిల్లీకి సీఎం జగన్..నేరుగా వివరణ
ఇదే సమయంలో..ఇతర పార్టీలతో పాటుగా బీజేపీ సైతం అమారవతి తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకించటం పైన వైసీపీ నేతలు ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం కమిటీల పేరుతో నిర్ణయం వాయిదా వేసినా.. కేంద్రం నుండి అభ్యంతరాలు లేకుండా చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం తానే స్వయంగా ప్రధాని మోదీ.. అమిత్ షా ను కలిసి ఈ నిర్ణయం వెనుక కారణాలను వివరించాలని భావిస్తున్నారు. అందు కోసం ఈ వారంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. రాజధాని పేరుతో జరిగిన అక్రమాలను వివరించటంతో పాటుగా.. మూడు రాజధానుల ప్రతిపాదనల గురించి సవివరంగా నివేదించాలని నిర్ణయించారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. దీంతో..ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో వచ్చే సంకేతాలు ప్రభుత్వ తదుపరి అడుగులకు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.