రష్యాలో తన అనుభవాన్ని పంచుకున్న డీఎంకే నేత స్టాలిన్
చెన్నై: సోవియట్ యూనియన్ పాలకుడు స్టాలిన్ పేరు చెబితే మన దేశంలో పెద్ద సమస్య ఎదురు కాకపోవచ్చు. కానీ రష్యా వంటి దేశాల్లో మాత్రం ఒక రకమైన అలజడి మొదలవుతుంది. కమ్యూనిస్టుల ఆదర్శ నేతగా ఖ్యాతి తెచ్చుకున్న ఆయన పేరు వింటే కొందరు రష్యా దేశస్థుల వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా? పేరుకు సంబంధించి తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌కు ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైందట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
‘నేను రష్యన్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే అక్కడున్న అధికారులు నా పేరు చెప్పమని అడిగారు. వెంటనే నేను ‘స్టాలిన్’ అని చెప్పాను. అంతే, విమానాశ్రయంలో ఉన్న వారందరూ ఒక్కసారిగా నా వైపు చూశారు. కొందరి ముఖాల్లో ఆశ్చర్యం, అసహనం కనిపించాయి. నా పాస్ పోర్టును తనిఖీ చేస్తుండగా అధికారులు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఇదంతా 1989లో ట్రిప్‌కు వెళ్లినప్పుడు జరిగింది. రష్యాలోని చాలా మందికి జోసెఫ్ స్టాలిన్ అంటే ఇష్టం లేకనే ఇలా జరిగింది’ అని చెప్పుకొచ్చారు. ఎంకే స్టాలిన్ తండ్రి కరుణానిధి సోషలిస్ట్. దీంతో తన కుమారుడికి స్టాలిన్ అనే పేరు పెట్టుకున్నట్లు చెబుతారు.