నేడు ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ మొదలు
ధర్మశాల:
దక్షిణాఫ్రికాతో పొట్టి క్రికెట్ సమరానికి కోహ్లీసేన సై అంటోంది. జోరుమీదున్న కుర్రాళ్లతో టీ20 సిరీస్‌కు కత్తులు దూస్తోంది. తమ సత్తా నిరూపించుకోవాలన్న కసితో ఉన్న యువకులకు సారథి విరాట్ అండగా ఉన్నాడు. వారికి సరైన మార్గనిర్దేశం చేసేందుకు రవిశాస్త్రి ప్రణాళికలను రచించాడు. నేడు ధర్మశాల వేదికగా జరిగే తొలి పోరుకు యువరక్తం, అనుభవాల మేలు కలయికతో టీమిండియా సిద్ధమైంది.
సుదూర ప్రణాళికతో..
ఇప్పటికే వన్డే ప్రపంచకప్ మిస్సైంది. అందుకే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకొనేందేకు టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే దక్షిణాఫ్రికా సిరీస్‌కూ యువకులతోనే ప్రయోగాలు చేపట్టాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. జూనియర్ల సత్తా పరీక్షించేందుకు సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చారు. కరీబియన్ సిరీస్ మాదిరిగానే వాషింగ్టన్ సుందర్, క నాల్ పాండ్య, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, ఖలీల్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. అనుభవం, యువరక్తం సమ్మేళనంతో వైవిధ్యమైన జట్టును రూపొందించాలన్నది సెలక్టర్ల వ్యూహం. ఆపదలో ఆదుకొనేందుకు కోహ్లీ, రోహిత్, ధావన్ ఉండనే ఉన్నారు.
మెరిసిన కుర్రాళ్లు..
వెస్టిండీస్ సిరీస్‌లో కుర్రాళ్లు బాగానే రాణించారు. ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నారు. రిషభ్‌పంత్ ఒక అర్ధశతకం సాధించాడు. ఐతే చెత్త షాట్లతో వికెట్ ఇచ్చుకొనే బలహీనత నుంచి అతడు బయటపడాల్సి ఉంది. ప్రపంచకప్‌లో అతడు ఎక్స్-ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది. ఎప్పటిలాగే బ్యాటింగ్ విభాగంలో విరాట్, రోహిత్ జట్టును ముందుండి నడిపించారు. మనీశ్ పాండేకు 3 టీ20ల్లోనూ చోటు దక్కినా 27 పరుగులే చేశాడు. అతడు నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ పరంగా కుర్రాళ్లు అదరగొట్టాడు. నవదీప్ సైని అరంగేట్రమే 3 వికెట్లతో ఘనంగా జరిగింది. ఈ సిరీస్‌లో అతడు 5 వికెట్లు తీశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం అతడి ప్రత్యేకత. పేసర్లకు అనుకూలించే ధర్మశాలలో అతడు సత్తా చూపడం ఖాయమే!
చాహర్.. వారెవ్వా!
యువ పేసర్ దీపక్ చాహర్ అద్భుతం చేశాడు. ఆడింది ఒక్క మ్యాచే అయినా 3 ఓవర్లు విసిరి 3 వికెట్లు తీశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. అతడి ఎకానమీ 1.33 కావడం గమనార్హం. క నాల్ పాండ్య అటు బంతి ఇటు బ్యాటుతో రాణించాడు. మూడు టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్సుల్లో 32 పరుగులు సాధించాడు. అవసరమైతే భారీ షాట్లతో స్ట్రైక్‌రేట్‌ను సైతం పెంచగలగడం అతడి ప్రత్యేకత. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ చాహర్‌కు అద ష్టం కలిసిరాలేదు. అనుభవజ్ఞుడైన పొలార్డ్ అతడిని లక్ష్యంగా ఎంచుకొని పరుగులు చేశాడు. సొంతగడ్డపై అతడు రాణిస్తాడని జట్టు నమ్ముతోంది. రిజర్వు బెంచీని పటిష్ఠం చేయడం, ప్రపంచకప్‌ను దష్టిలో పెట్టుకొంటే ఈ సిరీస్‌లో యువకులకు అవకాశాలు దక్కడం ఖాయమే అనిపిస్తోంది.
యువ సఫారీలు
దక్షిణాఫ్రికా పరిస్థితి ఈ సారి భిన్నంగా ఉంది. జట్టుకు కొత్త సారథి, కొత్త డైరెక్టర్ వచ్చారు. ఫుట్‌బాల్ లీగ్‌లో ఫ్రాంచైజీ తరహాలో ప్రయోగం చేయనున్నారు. టీమిండియా మాదిరిగానే సఫారీలూ యువకులకే పెద్దపీట వేశారు. బవుమా, బోర్న్ ఫార్టిన్, బ్యురాన్ హెండ్రిక్స్, రెజా హెండ్రిక్స్, అన్రిచ్ నోర్జె, జార్జ్ లిండెను ఎంపిక చేశారు. సారథి డికాక్, మిల్లర్, రబాడ రూపంలోనూ అనుభవజ్ఞులు ఉన్నారు. జట్టులో చోటు విషయంలో హామీ లభించడంతో యువకులు చెలరేగే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో డసెన్ నిలకడగా ఆడాడు. జూనియర్ డలా రూపంలోనూ టీమిండియా యువ బౌలర్లకు ముప్పు పొంచి ఉంది. డికాక్, రబాడకు భారత్‌లో ఆడిన అనుభవం ఉండటం వారికి సానుకూల అంశం. ఏమాత్రం ఏమర పాటుగా ఉన్నా ప్రత్యర్థి రెచ్చిపోయే అవకాశం ఉంది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ, ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్‌పంత్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, క నాల్ పాండ్య, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, నవ్‌దీప్ సైని.
సఫారీ జట్టు: క్వింటన్ డికాక్, డసెన్, బవుమా, జూనియర్ డలా, బోర్న్ ఫార్టిన్, బ్యురాన్ హెండ్రిక్స్, రెజా హెండ్రిక్స్, మిల్లర్, అన్రిచ్ నోర్జె, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, రబాడ, శాంసి, జార్జ్ లిండె.