ఆళ్లగడ్డలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం:: ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి

ఆళ్లగడ్డ, మార్చి 21 (విభారె న్యూస్):
పట్టణంలోని టీ.బి.రోడ్డులో గల ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణా శిబిరం ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షుడు ఆవుల విజయ భాస్కరరెడ్డి వెల్లడించారు.

ఇంటర్మీడియట్ మరియు అంతకంటే పై చదువులు పూర్తి చేసిన విద్యార్థిని, విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని ఆయన తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత పది సంవత్సరాలుగా పూర్తిగా ఉచితంగా ఈ శిక్షణ అందిస్తూ, ఇప్పటివరకు సుమారు 1500 మంది పేద విద్యార్థిని, విద్యార్థులు ప్రయోజనం పొందినట్లు వివరించారు.

శిక్షణ పూర్తయిన అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 21వ తేదీ నుండి సేవాసమితి కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని చెప్పారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునే వారు పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో వెంటనే దరఖాస్తు పూర్తి చేసి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 94402 32308, 95420 44106, 78933 82336, 94418 08737 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.