పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించండి ::మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ.

ఆళ్లగడ్డ :: విభారె న్యూస్ :: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా ఈ రోజు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసినట్టు ఆళ్లగడ్డ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కరరెడ్డి తెలిపారు. భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ వినాయక చవితి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు మనం వినాయక చవితిగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే అనేక రసాయనాలు కలిపి తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం దెబ్బతింటుందని, రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పిల్లలకు విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రసాయనాలు వాడిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వాతావరణ కాలుష్యం మరియు జల కాలుష్యం ఏర్పడుతోందని దీని వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన తెలిపారు. పూర్వం అందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించే వారు. కనుక సర్వసిద్ధంగా ప్రకృతి మనకు ఇచ్చిన మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకునేవారు. ప్రజల్లో కూడా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెరిగిందని, ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలకు పెరుగుతున్న ఆదరణ అందుకు నిదర్శనం అని ఆయన తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజించి ఆ విగ్నేశ్వరుని కృపకు పాత్రులు కావాలని అయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బి. నీలకంఠేశ్వరం,
దామోదర రెడ్డి, ఆళ్లగడ్డ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి బర్రెంకల పుల్లయ్య, నాగరాజు, ప్రసాదు, వివేకానంద విశ్వ మానవ సేవా సమితి అధ్యక్షులు శివప్రసాద్ మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.