
ఆళ్ళగడ్డ (విభారె న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలో ఒక వైపు కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం వారు విధించిన లాక్ డౌన్ నిబంధనలు ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. మరోవైపు ఆళ్లగడ్డ పట్టణంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా మాంసవిక్రయ దుకాణాలు వెలిశాయి. ఆదివారం వస్తే రోడ్లన్నీ అసహ్యంగా మారుతున్నాయి.మాంస విక్రయదారులు రోడ్డు పక్కనే బహిరంగంగా జంతు వధ చేసి అక్కడే మాంస విక్రయం చేస్తున్నారు. దీని వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆళ్లగడ్డ మునిసిపాలిటీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వారికి రావలసిన రుసుము మాత్రం వసూలు చేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు.
ఇక శాఖాహారుల బాధ వర్ణనాతీతం. ఆదివారం వస్తే శాఖాహారులు రోడ్లపైకి వెళ్లాలంటేనే అసహ్యించుకుంటున్నారు. నగర పంచాయతీ వారి పనితీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. రోడ్డు పక్కన దుమ్ములో, మురికి కాలువల పక్కన పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. నగర పంచాయతీ వారి కబేళాలు ఉన్నప్పటికీ, మాంసవిక్రయ దారులు తమ దుకాణాలను రోడ్డు ప్రక్కనే బహిరంగంగా తెరిచినప్పటికీ పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అసలు ఆళ్లగడ్డలో నగర పంచాయతి అధికారులు ఇవన్నీ గమనిస్తున్నారా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు ఏమాత్రం చేపట్టడము లేదు. ఈ విషయమై ఆళ్లగడ్డ మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా త్వరలో మాంసవిక్రయ దారులు అందరికీ సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ మాంస విక్రయం జరగకుండా కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు మాంసం దుకాణాల వద్ద గుంపుగుంపులుగా ఎగబడుతున్నారు.
ఏ మాత్రం సామాజిక దూరం పాటించడంలేదు. ఇలా అయితే అతి త్వరలో ఆళ్లగడ్డలో కరోనా పాజిటివ్ కేసులు వందల సంఖ్యకు చేరినా కూడా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా మునిసిపల్ కమిషనర్ కు ప్రజల ఆరోగ్యవిషయంలో నిజమైన శ్రద్ధ ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకొని బహిరంగ మాంస విక్రయము జరగకుండా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. బహిరంగ కబేళాలు నేరమని కోర్టులు చెబుతున్నప్పటికీ మునిసిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడం శోచనీయము.