విభారె న్యూస్:- మండలంలోని అహోబిలంలో ఈనెల 15న మోకుల పెద్దన్న అనే వ్యక్తి అడవికి వెళ్లగా నాటు తుపాకితో కాల్చి గాయపరిచిన కేసులో కాకి ఆంజనేయులు అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఆళ్లగడ్డ రూరల్ సిఐ హనుమంతు నాయక్ తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 15న మోకుల పెద్దన్న అనే వ్యక్తి చిన్నాన్న కొడుకు మోకుల నరసింహతో కలిసి తేనె కోసం అహోబిలం అటవీ ప్రాంతానికి వెళ్లారు. కాకి రామాంజనేయులు అనే వ్యక్తి వారిని వెంబడించి నరసింహను తుపాకితో కాల్చగా అది గురి తప్పి పెద్దన్నకు తగిలిందన్నారు. పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదుతో డిఎస్పి వెంకటరామయ్య పర్యవేక్షణలో తమ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేపట్టారన్నారు . దర్యాప్తులో భాగంగా శుక్రవారం పెద్ద కందుకూరు మెట్ట వద్ద రామాంజనేయులును అరెస్టు చేసి కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలోని అడవి ప్రాంతంలో దాచిపెట్టిన నాటు తుపాకీని, ఐదు సీసపు గుళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నరసింహ తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో తుపాకితో కాల్చాడని ఫిర్యాదు దారుడు పెద్దన్న తెలిపారన్నారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై నరసింహులు, సిబ్బంది సురేష్ రెడ్డి, నాగరాజు, ప్రతాప్, రాధాకృష్ణ ఉన్నారు.