
హైదరాబాద్ : ప్రత్యక్షంగా భారత్ ను ఏమీ చేయలేమని తెలిసిన డ్రాగన్ దేశం పరోక్షంగా భారతదేశం పై విషం చిమ్ముతూ ఉంది. ప్రముఖ సంస్థలు, వ్యక్తులు, లక్ష్యంగా చైనా నుంచి వేల సంఖ్యలో సైబర్ దాడులు జరుగుతున్నట్లు నిపుణులు, నిఘా వర్గాలు, హెచ్చరించడంతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. చైనా హ్యాకర్లు ప్రముఖ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలే లక్ష్యంగా సైబర్ దాడులకు యత్నిస్తున్నారంటూ సంబంధిత వర్గాలను అప్రమత్తం చేసింది. ఉచిత కరోనా పరీక్షలు అంటూ ncvi@gov.in పేరిట దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లో ప్రజలందరికీ మెయిల్స్ పంపుతున్నారు. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతులు. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నగరాలను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. ఉచిత కరోనా పరీక్షల వివరాలకోసం వీటిని ఎవరు చూసినా వారి మెయిల్ అకౌంట్లు పూర్తిగా సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళతాయి అంటూ నిఘా వర్గాలు వివరించాయి.
అపరిచిత మెయిల్స్ చూడకపోవడమే శ్రేయస్కరమని, చైనా నుంచి హ్యాకర్లు వేర్వేరు పేర్లు, సంస్థలతో వేల సంఖ్యలో మెయిల్స్ పంపిస్తున్నారని అధికారులు తెలిపారు. కొత్త సంస్థలు, భారీ రాయితీలంటూ మెయిల్స్ వస్తున్నాయి.
అపరిచిత వ్యక్తులు పంపించిన మెయిల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే వాటితో పాటు చాలా ప్రమాదకరమైన లింకులు ఉన్నాయి. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా గమనించి అనుమానం వచ్చిన వెంటనే వాటిని తొలగించండి.
భారత దేశంలో సమాచార వ్యవస్థను ధ్వంసం చేసేందుకు చైనా చెందిన హ్యాకర్లు కుట్రలకు పాల్పడుతున్నారు. కొన్ని సెల్ నెట్‌వర్క్‌లు, మీడియా సంస్థలకు హాని చేసేందుకు డార్క్‌నెట్, డీప్వెబ్లలో చైనా హ్యాకర్లు జరిపిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయా కంపెనీలు వారం రోజుల నుంచి భద్రతా ప్రమాణాలను భారీ స్థాయిలో పెంచుకుంటున్నాయి. భారత్‌లోని టాప్-20 సంస్థల వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయి ఆర్థికంగా అస్తవ్యస్తం చేసేందుకు హ్యాకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారంటూ నిఘా వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన అనేకమంది హ్యాకర్లు గత 5 రోజుల్లో దాదాపు 40 వేల సైబర్ దాడులకు తెగ పడినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.