
ఆళ్లగడ్డ:(విభారె న్యూస్)జగన్ మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై అనేక పార్టీల నుండి అనేకమంది నాయకుల మొదలు కార్యకర్తల వరకు వైసిపి పార్టీ లో చేరుతున్నారని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, మేము ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టడం లేదని, అలాంటివి ప్రోత్సహించే మనస్తత్వం మాది కాదని ఆయన అన్నారు. మాజీ మంత్రి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. వారిపై బనాయించిన కేసులన్నీ ఎక్కువ శాతం కేసులు పోలీసులు నమోదు చేసినవేనని, వీరిపై బనాయించిన కేసులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వారి స్వయంకృతాపరాధం వలననే వారిపై కేసులు నమోదు అవుతున్నాయి తప్ప, ఎవరు వారిపై అక్రమ కేసులు బనాయించడం లేదని తెలిపారు. అక్రమ కేసులతో వైసీపీ ప్రభుత్వం ఎవరిని వేధిచడం లేదని తప్పు జరిగినప్పుడు మాత్రమే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సర కాలంగా ఆర్లగడ్డ లో ఎలాంటి దౌర్జన్యకర సంఘటనలు జరగలేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. వైసిపి కార్యకర్తలెవరూ కూడా ఏలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కేవలం ప్రజా సంక్షేమం వైపే దృష్టి పెట్టింది. తెలుగుదేశం పార్టీ వారు తప్పులు చేసి మా పై అనవసరమైన ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు కనుక ఏదైనా ఆరోపణలు చేసే ముందు ముందువెనుకలు ఆలోచించాలని, లేకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన సూచించారు. మేము ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు.