కరోనా పేరిట అన్నింటా స్కాములు చేస్తున్నారు : తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు


హైదరాబాద్‌: ఒకవైపు కరోనా ప్రభావంతో రాష్ట్రం విలవిలలాడుతుంటే,  ఈ పరిస్థితుల్లోనూ వైకాపా కుంభకోణాలు, కక్ష సాధింపు చర్యలు దారుణమని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెదేపా లోని సీనియర్‌ నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్ లో‌ సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి మూడు మాస్కులు ఇస్తామని చెప్పి వైకాపా ప్రజలను మోసం చేసిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 

‘‘కరోనా కిట్లు,  మాస్క్‌ల తయారీలోనూ   బ్లీచింగ్‌ కొనుగోళ్లలో వైకాపా కుంభకోణాలు చేస్తోంది. 108 అంబులెన్స్‌లలో రూ.307 కోట్ల స్కామ్‌ జరిగింది. అంబులెన్సుల కాంట్రాక్ట్‌   విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీకి ఇవ్వలేదా?  సరస్వతి పవర్‌ మీ సొంత కంపెనీ  కాదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

‘‘ సాక్షాత్తు ఒక పార్లమెంటు సభ్యుడు తన ప్రాణాలకు ప్రమాదం ఉందని రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి లేఖ రాయలేదా?   రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని… కేసులు పెట్టి వేదిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఇటీవల ఆరోపించారు. రాష్ట్రంలో వైకాపా దుర్మార్గాలకు ఇంతకన్నా రుజువు ఏం కావాలి. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ఇవే నిదర్శనం. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని గతంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ లేఖ రాసింది నిజం కాదా? ’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.