దేవాదాయ శాఖ ఆలయ భూములకు కాపలాదారు మాత్రమే : విశ్వహిందూ పరిషత్

​నంద్యాల (విభారె న్యూస్): దేవాలయాలకు చెందిన మాన్య భూములు దేవాదాయ శాఖ సొత్తు కాదని, అవి దైవకార్యాల కోసం కేటాయించినవని విశ్వహిందూ పరిషత్ (VHP) స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం భానుముక్కల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 35 ఎకరాల మాన్యం భూమిని పేదలకు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై విహెచ్‌పి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
​నంద్యాల జిల్లా కేంద్రంలోని విహెచ్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నాయకులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి ​”పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వ భూములను వినియోగిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దానిని మేము స్వాగతిస్తాం. కానీ, దేవుడి భూములను పంపిణీ చేయాలని చూడటం అన్యాయం. దీనిపై అవసరమైతే ప్రజా పోరాటంతో పాటు న్యాయపోరాటం చేస్తాం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌కు, ఎండోమెంట్ డీఈవోకు వినతిపత్రం సమర్పిస్తాం.”

జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి ​ మాట్లాడుతూ “దేవాలయ భూములను పంపిణీ చేస్తూ పోతే భవిష్యత్తులో దేవాలయ వ్యవస్థ కుంటుపడుతుంది. దేవాలయాలు సజావుగా సాగాలంటే ఆ మాన్యాల రక్షణ తప్పనిసరి. ప్రభుత్వ అవసరాల కోసం దేవుడి భూములను వాడుకోవడం సరైన పద్ధతి కాదు. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయడం శోచనీయమని అన్నారు.
విశేష సంపర్క ప్రముఖ్ కాల్వ శేష సాయి మాట్లాడుతూ
​”గతంలో కూడా దేవాలయ భూముల విషయంలో కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని,దేవుడి భూములను ఇతర అవసరాలకు వాడటం తప్పని న్యాయస్థానాలు చెప్పిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి గారి వ్యాఖ్యల నేపథ్యంలో, దేవాలయ భూములను కాపాడాలని వీరంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.