విభారె న్యూస్ :: ఒకవైపు కొత్త కొత్త వేరియంట్ లతో కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ అందించేందుకు నిర్ణయించుకుంది. కానీ మరోవైపు ఇదే అదనుగా ఆన్లైన్ కేటుగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. బూస్టర్ డోస్ పేరుతో మీకు ఒక మెసేజ్ లేదా ఫోన్ కాల్ వస్తుంది. వారు ముందే సేకరించి పెట్టుకున్న డాటా ప్రకారం మీరు గతంలో తీసుకున్న వ్యాక్సిన్ ల వివరాలు తేదీలతో సహా ఖచ్చితంగా చెబుతారు. వారు చెప్పే వివరాలన్నీ మీకు వాస్తవమైనవిగా అనిపిస్తాయి. ఒమిక్రాన్ వేరియంట్ నుండి రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందించే బూస్టర్ డోసు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని మీకు సూచిస్తారు. మీరు అంగీకరిస్తే మీ ఫోన్ కు వచ్చిన ఓ.టి.పి. ని తెలుపమని కోరుతారు. మీరు ఓటీపీ తెలిపిన మరుక్షణం మీ బ్యాంకు ఖాతా లోని సొమ్ము మొత్తం మాయమవుతుంది. కనుక ఇలాంటి కేటుగాళ్ల తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.