ఆళ్లగడ్డ లో ఘనంగా ఘంటసాల 99వ జయంతి

ఆళ్లగడ్డ :: ( విభారె న్యూస్ ) :: ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి లో అమరగాయకుడు ఘంటసాల 99వ జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.లలిత కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిజ్జం వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది మరియు ‘విభారె’ పత్రికా సంపాదకులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మల్లిక్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. అనేకమంది వివిధ రంగాలలోని కళాకారులను, పాత్రికేయులను ఈ సందర్భంగా దుశ్శాలువలు కప్పి సత్కరించారు. ఆదరణ కోల్పోతున్న రంగస్థల కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే సారి ఇంత మంది కళాకారులను ఒక వేదిక పైకి చేర్చి సత్కరించడం వలన అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. తమను గుర్తించి గౌరవించినందుకు పాత్రికేయులు మరియు రంగస్థల కళాకారులు బిజ్జం వెంకటేశ్వర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగా నెల్లూరుకు చెందిన రంగస్థల కళాకారిణి అపర్ణ, మరియు ఆళ్లగడ్డ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ లో సంగీత ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న మాధవి లత గార్లను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు రామకృష్ణ, సంజీవరెడ్డి, సంజీవ రాయుడు బాలరాజు, మొదలగు వారు పాల్గొన్నారు.