ఆళ్లగడ్డ మున్సిపల్ కమీషనర్ గారికి బహిరంగ లేఖ

అయ్యా….

ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజల వద్దకు చేరాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న దృఢ సంకల్పంతో  ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. ప్రజాసంక్షేమం కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ,   కేవలం  అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ పథకాలన్నీ నిరుపయోగమై,  నీరుకారి పోతున్నాయి. అందుకు మన ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఒక నిదర్శనం. అధికారులు సామాజిక మాధ్యమాలలో తమ ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత సమస్యల పరిష్కారానికి ఇవ్వడంలేదు. సమస్యలపై కనీస స్పందన కూడా లేకపోవడం శోచనీయం.  సమస్యలపై మీకు నేరుగా ఫిర్యాదు చేసినా కూడా స్పందించడం లేదు. ఏం చేస్తే మీరు ప్రసన్నమవుతారో తగిన మార్గం తెలియక ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు తికమక పడుతున్నారు.  అందుకే పత్రికా ముఖంగా ప్రశ్నించాల్సి వస్తోంది. చిన్న సమస్యను కూడా పరిష్కార దిశగా చర్య తీసుకోకుండా,  ఏమాత్రం అనుభవం లేని గ్రామ సచివాలయ ఉద్యోగుల పైన నెపం పెడుతూ, అనుభవజ్ఞులైన అధికారులు తప్పించుకుంటున్నారు.  ఆర్లగడ్డ పట్టణం నడిబొడ్డున ఉన్న బాలాజీ వీధి నుండి, పుల్లారెడ్డి వీధికి  పోవు దారిలో ఎడమవైపు ఉన్న ఈ వీధి మురుగు నీటితో, ముళ్ల కంపలతో పూడుకుపోయి ఉంది. పారిశుధ్య నిర్వహణ లోపం స్పష్టంగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది.     ఈ ప్రాంతం మనుషులకు ఏ మాత్రం నివాసయోగ్యంగా లేదు. కనీసం అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా దుర్వాసనతో కూడిన అనారోగ్యకర వాతావరణం నెలకొని ఉంది.  సమస్య పరిష్కరించమని, కొన్ని సంవత్సరాలుగా నగర పంచాయతీకి  ఈ ప్రాంత వాసులు విన్నవించుకుంటూనే ఉన్నారు. మీ వైపు నుండి ఎలాంటి స్పందన లేదు. ఆ వీధి లో నిర్మించిన ఇళ్లకు పన్నులు మాత్రం చాలా శ్రద్ధగా వసూలు చేస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం దిశగా  ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ఆళ్లగడ్డ మునిసిపల్ కమిషనరుగా మీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు అనేక నెలలుగా, అనేకసార్లు, మీకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. సంవత్సరాల తరబడి ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు  ఇబ్బంది పడుతుంటే చోద్యం చూస్తున్నారు. మునిసిపల్ ఉన్న తాధికారులు ఇంత వరకు ఈ సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించుటకు రాకపోవడం శోచనీయం. ఈ ప్రాంత ప్రజలు మీకు  ప్రత్యక్షంగా పన్నులు చెల్లిస్తున్నారు. ఈ ప్రాంతం ఆర్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోనే  ఉంది. ఆ విషయం బహుశా మీకు తెలియదనుకుంటాను.ఎప్పుడూ మెయిన్ రోడ్ల  వెంట వాహనాలలో కాకుండా కాస్త పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే చిన్న చిన్న సందుల గుండా తిరిగితే ప్రజల సమస్యలు మీకు అర్థం అవుతాయి. అయ్యా.. కమీషనర్ గారూ…దయచేసి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శించాలని కోరుచున్నాము.ఆళ్లగడ్డ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ రామారావు గారు ఆరు నెలల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉన్నారు. ఆయనకు ఈ సమస్య పైన పూర్తిగా అవగాహన ఉంది. కానీ  ఆసక్తి  లేదు. దయచేసి ఇప్పటికే కరోనా ప్రభావం కారణంగా ఆర్థికంగా చితికిపోయి ఉన్నవారిని మరింత అనారోగ్యం పాలు చేయకుండా మీరు వెంటనే తగిన చర్య తీసుకుని సమస్యను పరిష్కరించ వలెనని ప్రార్థిస్తున్నాము. 

           ఇట్లు తమ విధేయులు

           ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు