విభారె న్యూస్ :: చల్లటి హిమాలయాలు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. చైనా జిత్తులమారి తనాన్ని ముందే పసిగట్టిన భారత్ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ దూకుడుగా ముందుకు సాగిపోతోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రెండు దేశాలు ఒక్కొక్కరు దాదాపు లక్ష మందికి పైగా సైన్యాన్ని మోహరించినట్టు సమాచారం. భారీగా యుద్ధ సామాగ్రిని భారీగా యుద్ధ సామాగ్రిని చేరవేస్తున్నాయి.
రెండున్నర నెలల కిందట గల్వాన్ లోయలో చైనా తీసిన దొంగదెబ్బకు భారత్ ఇప్పుడు దీటుగా సమాధానం ఇచ్చింది. ప్రతీకారంగా ఇప్పుడు పాంగాంగ్ దక్షిణ రేవును భారత్ తన వశం చేసుకుంది. ఈ ప్రాంతాన్ని అర్ధరాత్రి వేళ దొంగచాటుగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన చైనాకు షాక్ ఇచ్చింది. ఆ ప్రాంతంలోని కీలక పర్వత శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ఈ ప్రాంతంపై భారత్ పూర్తిగా పట్టు బిగించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రాగన్ కదలికలను విస్పష్టంగా వీక్షించొచ్చు. ఈ చర్యను చైనా జీర్ణించుకోలేకపోతోంది. కనీసం రెండు పర్వత శిఖరాల నుంచి భారత దళాలను ఖాళీ చేయించేందుకు మాటిమాటికీ విఫలయత్నం చేస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు కారణమవుతోంది. ఫలితంగా ఇరు దేశాలు తమ సైనికులను ముమ్మరంగా మోహరించి సాగాయి. శనివారం రాత్రి చుషుల్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న మోల్దో నుంచి భారీగా చైనా ట్యాంకులు, వ్యాన్‌లు ముందుకు కదలడం గమనించిన భారత సైన్యాలు చైనా కంటే ముందుగానే ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడంతో డ్రాగన్ కు దిమ్మతిరిగిపోయింది.