రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది :: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి ::  (విభారె న్యూస్) :: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో దళితుల అనుమానాస్పద మరణాలు, మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు  చంద్రబాబు  లేఖ రాశారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి అన్నారు. సంఘ విద్రోహ శక్తులు అన్నీ కలిసి,  ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారని ధ్వజ మెత్తారు.. విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ,  రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాసి  మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దళిత వర్గానికి చెందిన ఎం.నారాయణ, ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  నియోజకవర్గంలో శాంతిభద్రతలు క్షీణించాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.  జర్నలిస్ట్‌లపై విచ్చలవిడి దాడులు కొనసాగితే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యం ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి దాడులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ కి రాసిన లేఖలో ఆయన కోరారు.