8 నెలల తరువాత సరిహద్దు లో దొరికిన భారతీయ సైనికుడి మృతదేహం

దెహ్రాదున్‌: ఈ ఏడాది ప్రారంభంలో తప్పిపోయిన హవల్దార్‌ రాజేంద్రసింగ్‌ నేగి (36) మృతదేహాన్ని కశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద శనివారం గుర్తించారు. తప్పిపోయిన ఈ జవాను సరిహద్దు ప్రాంతంలో మంచులో శవమై కనిపించాడు. 11వ గర్‌వాలీ రైఫిల్స్‌కు చెందిన భారత జవాను కశ్మీర్‌లోని గుల్‌మర్గ్‌ ప్రాంతంలోని ఎల్‌ఓసీ వద్ద విధులు నిర్వహిస్తూ జనవరిలో ప్రమాదవశాత్తూ మంచు కొండల్లోకి జారి పడ్డాడు. అతడి మృతదేహాన్ని కనుగొనడం సాధ్యం కాకపోవడంతో జూన్‌లో నేగీని అమరవీరుడిగా ప్రకటించారు. అయితే నేగీ అమరుడయ్యాడన్న విషయాన్ని అతడి భార్య రాజేశ్వరి దేవి అంగీకరించలేదు. తన భర్త మృతదేహాన్ని చూసే వరకు ఆయన మరణించాడనే వార్తను అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.శనివారం మృతదేహం లభ్యమైనట్లు భారత సైనిక అధికారులు నేగీ కుటుంబానికి వెల్లడించారు.వైద్య సంబంధిత ప్రక్రియల కోసం మృతదేహాన్ని శ్రీనగర్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో ఉంచినట్లు, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సైన్యాధికారులు తెలిపారు.