బీజింగ్: యావత్ ప్రపంచం ఈ రోజు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితికి చైనాయే కారణమని నమ్ముతున్నారు. అలా ప్రపంచ సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన చైనా ఆర్థిక పరిస్థితి మాత్రం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది. అయితే చైనా ఆర్థిక పరిస్థితి కూడా పతనం అయినట్లు అక్కడి ఆర్థికరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. చైనాలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల, నిరుద్యోగ శాతం పెరిగిపోవడం వల్ల ఆదేశం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టంగా తెలియ చేస్తున్నాయి.
మార్చి నెల నుండి కరోనా వైరస్ విజృంభించడం వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది నిరుద్యోగులుగా మారినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాతోపాటు పలు దేశాలు చైనా పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగా భవిష్యత్తులో మరో కోటి మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని చైనా ఆర్థికనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రభావం చైనా ఎగుమతులపైనా పడింది. తాజాగా డిగ్రీ పూర్తిచేసుకున్న వారిలో దాదాపు 19.3శాతం నిరుద్యోగులుగానే మిగిలిపోయే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో దుకాణాలు, మార్కెట్లు, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికుల బ్రతుకు తెరువు కూడా భాగంగా మారింది. దీని కారణంగా ఏప్రిల్ నెలలో నిరుద్యోగ శాతం దాదాపు 20.5శాతంగా ఉండనున్నట్లు జోంగ్టై సెక్యూరిటీస్ అనే బ్రోకేజి సంస్థ చేసిన ఒక సర్వేలో తేలింది. అప్పటికే దాదాపు 7కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తన నివేదికలో తెలిపింది.అయితే ఈ నివేదికను అంతర్జాలం నుండి చైనా ప్రభుత్వం తొలగించింది.దీన్ని రూపొందించిన అధికారులపై చర్యలు కూడా తీసుకోవడం గమనార్హం. కరోనా విజృంభణకు ముందు కూడా చైనా ఆర్థికస్థితి మెరుగైన స్థితిలో లేదని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఆ దేశ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారినట్లు స్పష్టంగా తెలుస్తోంది.