ఆళ్లగడ్డలో కరోనా రోగుల సేవలో “హెల్పింగ్ హాండ్స్” సభ్యులు

ఆళ్లగడ్డ::(విభారెన్యూస్): ఓదార్పు అవసరమైన వేళ అవహేళనలు అవమానాలు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల మనోవేదన వర్ణనాతీతంగా ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి లేదు. నిత్యావసర వస్తువులు,  అవసరమైన మందులు కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. కరోనా పాపమూ  కాదు శాపమూ  కాదు. అది ఒక రోగం మాత్రమే. వైద్యులు, పోలీసులు,  పారిశుద్ధ్య కార్మికులు వీరందరూ కరోనా వేళలో ముందు వరుసలో ఉండి సేవలందించారు,  ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నారు.

 దురదృష్టవశాత్తు కరోనా రోగం బారిన పడ్డ వారి కంటే,  నిర్ల్యక్షంతో  రోగం కొని తెచ్చుకున్న వారే ఎక్కువ. కరోనా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారు కనీసం దాని ఫలితం వచ్చేవరకు అయినా ఇంటిపట్టున ఉండడం లేదు.వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పాజిటివ్ అని తెలిసేటప్పటికే ఇంకా కొద్ది మందికి ఈ రోగాన్ని అంటించిన తర్వాత క్వారంటైన్ కి వెళ్తున్నారు.కరోనా బారిన పడితే, స్నేహితులు, బంధువులు,  సొంత కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్న   వేళ,  మీకు మేమున్నామంటూ ఆర్లగడ్డ పట్టణంలోని స్వచ్ఛంద సేవా సంస్థ “హెల్పింగ్ హాండ్స్” కరోనా బాధితుల సేవలో దూసుకుపోతోంది. ఈ హెల్పింగ్ హాండ్స్ సంస్థకు చెందిన ప్రసాద్ (సురేంద్ర సెల్ పాయింట్), కింగ్ బాష, రవికాంత్ చౌదరి (AE. Ele), గుండా రవికుమార్, సతీష్ (హనీ ప్రణి మెడికల్ స్టోర్), పెద్దన్న, J. మధుసూదన్ బాబు(దుర్గజ్యువలర్స్),

అశోక్(అహోబిళం),విజయ్(అరటిపండ్ల మండి), చరణ్, అనే యువకులు కష్టకాలంలో మానవత్వాన్ని వర్షంలా కురిపిస్తున్నారు. కరోనా బాధితుల  ఇంటి వద్దకే వెళ్లి, వారికి ధైర్యం చెప్పి ఓదార్చడమే కాకుండా వారికి క్వారంటైన్ సమయంలో కావలసిన నిత్యావసర వస్తువులు, అవసరమైన మందులు అందిస్తున్న ఆళ్లగడ్డ పట్టణము లోని ఈ యువకులను ఆపద్బాంధవులు  కాక మరి ఏమనాలి?  వీరి సేవాగుణం స్ఫూర్తిదాయకంగా ఉంది. వీరిని చూసైనా ఇంకొంత మందిలో మార్పు వస్తుందని, రావాలని, కరోనా వ్యాధి అంటే ప్రజలలో ఉన్న భయం పోవాలి అని ఈ సంస్థ సభ్యులు అంటున్నారు. సమాజంలో అరుదుగా కనిపించే ఇటువంటి వ్యక్తుల అరుదైన, విలువైన సేవలను ప్రోత్సహించాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉంది.కేసులు పెరుగుతున్న దృష్ట్యా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం అలవాటు చేసుకోవాలి.  ఎవరికైనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్థారణ పరీక్షలు చేసుకోవాలి. సిగ్గుపడకుండా భయపడకుండా సకాలంలో వైద్యసేవలు పొందితే వైరస్‌ను సమర్థవంతంగా ఎదురు కోవచ్చని “హెల్పింగ్ హాండ్స్” సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీరి సేవలను ప్రజలు కొనియాడుతున్నారు.