విషం కలిపిన చపాతీలు తిని జిల్లా జడ్జి మృతి

బేతుల్‌(మధ్యప్రదేశ్‌): విషం కలిపిన చపాతీలు తిని ఓ జిల్లా జడ్జీ, అతని కుమారుడు మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో ఒక మహిళను కీలక సూత్రధారిగా అనుమానించిన పోలీసులు ఆమెను నిర్బంధంలోకి తీసుకుని విచారించగా  విషం కలిపిన చపాతీల వల్లే న్యాయమూర్తి మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

బేతుల్ జిల్లా‌ ఎస్‌పీ సిమలా ప్రసాద్‌ కథనం ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా అడిషినల్‌ సెషన్స్‌ జడ్జీగా పనిచేస్తున్న మహేంద్ర త్రిపాఠి, ఆయన కుమారుడు ఈనెల 20వ తేదీన చపాతీలు తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యశాలలో చికిత్స అందించారు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో న్యాయమూర్తితోపాటు అతని కుమారుడు కూడా చికిత్స పొందుతూ రెండురోజుల క్రితం మరణించారు. సంధ్యాసింగ్‌ అనే మహిళ ఈ విష ప్రయోగానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఛింద్వారాకు చెందిన సంధ్యాసింగ్(45)‌ అనే ఓ మహిళ స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతోంది. కొంతకాలం క్రితం న్యాయమూర్తి కూడా చింద్వారా లో పనిచేసి ఉండడంతో వారిద్దరూ స్నేహితులుగా మెలిగేవారు. ఈ సమయంలోనే న్యాయమూర్తికి బేతుల్‌కు బదిలీ అయ్యింది.  ఆయన భార్యాపిల్లలు కూడా అతనిదగ్గరకు చేరి కలిసి ఉంటున్నారు. దీనివలన గత నాలుగు నెలలుగా న్యాయమూర్తిని కలవడం సంధ్యాసింగ్‌కు వీలుపడలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన సంధ్యా సింగ్ త్రిపాఠి కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంది.

త్రిపాఠికి ఉన్న కొన్ని సమస్యలను సమస్యలను తెలుసుకున్న సంధ్యాసింగ్‌ ఓ కుట్ర పన్నింది.  ఓ ప్రత్యేక పూజ నిర్వహిస్తే సమస్యలు తొలగిపోతాయి అనే త్రిపాఠిని నమ్మించింది. పూజకోసం గోధుమ పిండి తీసుకురమ్మని అడిగింది. త్రిపాఠి తెచ్చిన గోధుమ పిండిలో విషం కలిపి  మరుసటి రోజు తిరిగి అతనికి ఇచ్చింది. ఇంటికి వెళ్లిన మహేంద్ర త్రిపాఠి ఆ రాత్రి సంధ్యా సింగ్ ఇచ్చిన పిండితో తయారు చేసిన చపాతీలు తిన్నారు. ఆయన కుమారుడు కూడా అవే చపాతీలు తినడంతో ఇద్దరికీ వెంటనే వాంతులు అయ్యాయి. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రీ కుమారులు రెండురోజుల కిందట మరణించారు. త్రిపాఠి భార్య మాత్రం చపాతీలు  తిననందు  వలన ప్రమాదం నుంచి బయటపడింది.

 విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు సంధ్యాసింగ్‌ను అరెస్టు చేసి విచారించడంతో కుట్ర విషయం వెలుగు చూసింది. సంధ్యాసింగ్‌ను,    ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు