ఉత్తర్‌ప్రదేశ్ :: ఓ యువకుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిద్రించేటప్పుడు అతడి జీన్స్ ప్యాంట్‌లోకి నాగుపాము దూరడంతో ఏడు గంటల పాటు కదలకుండా నిలబడాల్సి వచ్చింది. మీర్జాపూర్ పరిధిలోని ఓ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, తీగల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. పనులు చేసేందుకు వచ్చిన కార్మికులకు అక్కడే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో బస ఏర్పాటు చేశారు. అయితే రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు ఓ తాచుపాము ఓ కార్మికుడి జీన్స్ ప్యాంట్‌లోకి దూరి కదలకుండా ఉండిపోయింది. మెలుకువ వచ్చిన యువకుడు భయాందోళకు గురై వెంటనే లేచి నిలబడి పక్కనే ఉన్న స్తంభాన్ని రాత్రంతా కదలకుండా పట్టుకున్నాడు. తెల్లవారుజామున పాములు పట్టేవారిని పిలిపించి అతడి ప్యాంటులోంచి ఆ విష సర్పాన్ని సర్పాన్ని బయటకు తీయడంతో అక్కడివారంతా ఊపిరిపీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా అంబులెన్సును పిలిపించి నట్లు స్థానికులు తెలిపారు. కార్మికుడు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.