కరోనా టాబ్లెట్లు ఈ రోజే మార్కెట్లోకి విడుదల :: హెటిరో

దిల్లీ: కొవిడ్‌-19 రోగులకు అందించే చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఫావిపిరావిర్‌ను కరోనా వైరస్‌ వ్యాధి ప్రాధమిక, మధ్యస్థ దశలో ఉన్నపుడు వాడతారు. తాజాగా ఈ ఔషధం ఫావివిర్‌ మాత్రల రూపంలో బుధవారం నుంచి దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు, ఫార్మసీల్లో లభించనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే దీనిని వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటేనే అందచేస్తామని.. ఒక మాత్ర విలువ 59 రూపాయలుగా సంస్థ నిర్ణయించింది.
ప్రపంచంలో కరోనా కేసుల ఉధృతిలో మూడో స్థానంలో నిలిచిన భారత్‌లో ఈ ఔషధానికి విపరీతమైన డిమాండు ఉంది. ఈ నేపథ్యంలో ఫావిపిరావిర్‌ తయారీ, పంపిణీ చేసేందుకు తమకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి లభించినట్లు హెటిరో తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ఔషధ సంస్థ కోవిఫర్‌ పేరుతో ఇదివరకే రెమిడెసివిర్‌‌ ఔషధాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు  అనుగుణంగా తాము తయారుచేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.