కడప: మాజీమంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. నేటి నుంచి కడప కేంద్రంగానే విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. పదిరోజుల పాటు పులివెందుల వెళ్లి వివేకా ఇంటిలో సీబీఐ అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. మూడు సంచుల్లో జాగ్రత్త పరిచిన సిట్ దర్యాప్తు నివేదికలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నుంచి సీబీఐ ప్రత్యేక విచారణ అధికారి సమక్షంలో విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన సిట్ దర్యాప్తు దస్త్రాలను సైతం వాహనంలో తీసుకెళ్లారు.
స్వాధీనం చేసుకున్న దస్త్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అనుమానితులను జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి పిలిచి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 15 మంది అనుమానితుల జాబితాను సీబీఐ సిద్ధం చేసింది. తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సహా 15 మంది పేర్లు ఉన్నాయి. వీరందరికీ సీబీఐ నోటీసు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.