అనంతపురం: అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఊపిరాడక ఓ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోని రోడ్డు మీదే నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. శ్వాస అందక విలవిలలాడుతున్నభర్తను బతికించు కునేందుకు నిస్సహాయస్థితిలో ఓ మహిళ చేసిన ఆక్రందనలు గాలిలో కలిసిపోయాయి.
తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు కాళ్లావేళ్లా పడినా కూడా వైద్యులకు కనికరం లేకపోయింది. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకపోవడం దారుణం.
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రాజా అనే వ్యక్తి శ్వాస అందక ఇబ్బంది పడటంతో అతని భార్య, కుమార్తె గురువారం రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ రిజిస్టర్‌లో రాజాపేరు నమోదు చేయించుకున్నా కూడా మానవత్వం లేని ఆసుపత్రి సిబ్బంది మాత్రం వార్డులోకి రానీయలేదు. దీంతో ఆసుపత్రి ఆవరణలో రోడ్డుపైనే కూర్చుకున్న రాజా ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయి ఉదయం మృతి చెందాడు. ఆసుపత్రి నిబ్బందిని కాళ్లావేళ్లా పడి బ్రతిమలాడినా కూడా వారు వైద్యం చేయలేదని మృతుని భార్య కళావతి ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే బతికేవాడని కళావతి బోరున విలపించారు. కళ్లెదుటే నిస్సహాయ స్థితిలో రాజా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యం అక్కడివారిని కలచివేసింది. చివరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కావడంతో, ఆసుపత్రి సిబ్బంది వచ్చి స్ట్రెచర్‌పై మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించి చేతులు దులుపుకున్నారు.