ఏకే 47 తుపాకీ తో ఇద్దరు తాలిబాన్ ఉగ్రవాదులను చంపిన ఆఫ్ఘనిస్తాన్ బాలిక

 తన తల్లిదండ్రులను చంపిన తాలిబన్ ఉగ్రవాదులపై  తిరగబడి పోరాడి ఏకే 47 తుపాకీ తో ఇద్దరు ఆఫ్ఘన్ తీవ్రవాదులను మట్టుబెట్టిన ఆ బాలిక ధైర్యసాహసాలను సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.బాలిక తండ్రి ప్రభుత్వ మద్దతుదారుడు కావడంతో తాలిబాన్లు ఇంటికి వచ్చి ఆ బాలిక తల్లిదండ్రులను బయటికి వెళ్లి కాల్చి చంపేశారు. దీంతో కోపోద్రిక్తురాలైన మైనర్ బాలిక  మరియు ఆమె సోదరుడు కలిసి ఏకే 47 తుపాకీ తో తాలిబన్ తీవ్రవాదుల పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలు ఘోర్ ప్రావిన్స్ లోని స్థానిక అధికారులు తెలిపారు.

తుపాకీ పట్టుకున్న అమ్మాయి ఫోటో ఇటీవలి రోజుల్లో వైరల్ అయ్యింది. ఈ సంఘటన తరువాత గ్రివా గ్రామంలోని ఆ బాలిక ఇంటిపై దాడి చేయడానికి ఎక్కువ మంది ఉగ్రవాదులు వచ్చారు, కాని గ్రామస్తులు మరియు ప్రభుత్వ అనుకూల మిలీషియా కలిసి వారిని తరిమికొట్టారు.14 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికను, ఆమె తమ్ముడిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.

” తల్లిదండ్రులు లేని బాధ భరించలేనిది అని మాకు తెలుసు. కానీ మీరు తీర్చుకున్న పగ మీకు కాస్తయినా మనశ్శాంతిని ఇస్తుందని ఆశిస్తున్నాను” అని మొహమ్మద్ సలేహ్ అన్నారు.

స్థానిక మీడియా ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ యొక్క అత్యంత అభివృద్ధి చెందని పశ్చిమ ప్రావిన్సులలో ఘోర్ ఒకటి. ఇక్కడ మహిళలపై హింసకు పాల్పడే సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.ఫిబ్రవరిలో తాలిబాన్ అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది, కాని దాని సభ్యులు చాలా మంది ప్రస్తుత ఆఫ్ఘన్ ప్రభుత్వం మరియు రాజ్యాంగాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు.