నా నిక్కర్ సైజు తగ్గింది :: టైలర్ పై పోలీసులకు ఫిర్యాదు

భోపాల్: అసలే కరోనా టైంలో బిక్కుబిక్కుమంటూ డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఒక వ్యక్తి విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. గోటితో పోయే సమస్యను గొడ్డలి దాకా తీసుకు వచ్చే ఇటువంటి ఫిర్యాదులు పోలీసులకు తలనొప్పిగా మారాయి. కొందరయితే చిన్న చిన్న కారణాలకే పోలీస్టేషన్‌కి వెళుతుంటారు. అలాగే ఓ వ్యక్తి  నిక్కరు సైజులో తేడా వచ్చిందని ఆ టైలర్ పై ఫిర్యాదు చేశాడు. ఈ విడ్డూరమైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు చెందిన కృష్ణ కుమార్‌ దూబే తాను ఇచ్చిన వస్త్రానికి సరిపడా  నిక్కరు కుట్టకుండా,  సైజు బాగా తగ్గించి కుట్టాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

“అయితే దాన్ని మళ్లీ సరి చేసి ఇమ్మని అడిగితే అందుకు నిరాకరించడం వలన పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది ’’ అని దూబే పేర్కొన్నాడు.  నిక్కరు కుట్టేందుకు టైలర్‌ తన నుంచి 70 రూపాయలు వసూలు చేసినట్లు తెలిపాడు.  లాక్‌డౌన్ ‌ కారణంగా ఉపాధి కోల్పోయిన తనకు రెండు పూటలా ఆహారం దొరకడమే కష్టంగా ఉందని, దూబే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతడిని స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందిగా దూబేకు సలహా ఇచ్చారు.