మూడుసార్లు నెగిటివ్ చివరిదశలో పాజిటివ్ :: పోరాడి ఓడిన ఏఎస్సై

జూబ్లీహిల్స్‌:  పాజిటివ్ అని తేలే లోపే శరీరాన్ని గుల్ల చేసి నిండు ప్రాణాలను నిలువునా బలి తీసుకుంటోంది. ఉన్నట్టుండి కుటుంబాలను అనాథలుగాా మార్చి రోడ్లపైకి విసిరేస్తోంది! బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌ (55) గురువారం రాత్రి కరోనా తో కన్నుమూశారు.  ప్రేమ్‌కుమార్‌ ఈనెల 7న నేచర్‌క్యూర్‌ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా తేలింది. అయితే శ్వాస తీసుకునేందుకు సమస్యగా ఉండడంతో ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి లో చేర్పించారు. అక్కడ  వైద్యులు ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. గాంధీ ఆసుపత్రికికి వెళ్లాలని చెప్పారు. రిపోర్టులో నెగెటివ్‌ అని ఉండటంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ఎట్టకేలకు కింగ్‌కోఠిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మధ్యలో ఆక్సిజన్ అయిపోయింది.  మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా తాత్కాలికంగా ఆక్సిజన్‌ అందించి డిశ్చార్జ్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగాఉండడంతో గాంధీలో చేర్చుకున్నారు.  సోమవారం  అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండుసార్లు పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా.. గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికే వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్‌ గురువారం రాత్రి మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు. నిర్ధారణ పరీక్షల ఫలితాలు కచ్చితంగా లేకపోవడం వలన ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.