ముంబయి: ప్రేమకు సరిహద్దులు లేవు అంటారు. కానీ సరిహద్దులలో సైనికులు ఉంటారని తెలియక ఆ ప్రేమికుడు అడ్డంగా బుక్కయ్యాడు. పాకిస్తాన్ లో ఉన్న ప్రేమికురాలిని కలిసేందుకు పాకిస్థాన్ సరిహద్దులోకి వెళ్లిన ఓ యువకుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఉస్మాన్‌బాద్ టౌన్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిషాన్ మహ్మద్ సిద్ధిఖి గురువారం రాత్రి బైక్‌పై వచ్చి రాన్ ఆఫ్ కచ్ వద్ద భారత సరిహద్దు దాటి వెళ్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ పరిక్షిత రాఠోడ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడి వారి ప్రేమ ముదిరి పోయింది. సరిహద్దులు దాటి పోయి తన ప్రేయసిని కలవాలి అనుకున్నాడు. పాకిస్థాన్ సరిహద్దులోకి వెళ్లగానే అతని బైక్ ఇసుకలో ఇరుక్కుపోవడంతో విషయం బెడిసికొట్టింది. గమనించిన సరిహద్దు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ నెల 11 వ తేదీన సిద్ధికి బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరి వెళ్లినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. సిద్ధిఖి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఉస్మాన్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఆ ఫిర్యాదులోని వివరాల ఆధారంగా అతనిని సిద్దిఖీ గా గుర్తించిన పోలీసులు అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.