
నంద్యాలను వణికిస్తున్న కరోనా ::ఒక్క రోజే 106 పాజిటివ్ కేసులు
నంద్యాల::(విభారె న్యూస్): నంద్యాల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా భయం గొలిపే రీతిలో పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 106 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో నంద్యాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 99, గ్రామీణ ప్రాంతాల్లో ఏడు పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ కరోనా సెగ తగిలింది. దిన దినానికి పెరుగుతున్న కరోనా గ్రాఫ్ ప్రభుత్వ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. నిర్ధారణ పరీక్ష ఫలితాలు కూడా ఆలస్యం అవుతుండడంతో కరోనా సోకిన వారు కూడా ప్రజలలో కలసిమెలసి తిరుగుతూ ఉండటం వలన వైరస్ వ్యాప్తి విపరీతంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫలితాల నిర్ధారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని అప్రమత్తంగా ఉండక పోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.