
కాన్పూర్:: గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను ఎన్కౌంటర్లో కాల్చి చంపడానికి కొన్ని గంటల ముందు, గురువారం సాయంత్రం ముంబై న్యాయవాది సుప్రీంకోర్టులో ఘనశ్యామ్ ఉపాధ్యాయ అనే ముంబైకి చెందిన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లో గురువారం అరెస్టయిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్లో చంపి వేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈనెల రెండవ తేదీ ఎనిమిది మంది పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో నిందితులుగా ఉన్న అనుమానితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి వేశారని, ఈ ఎన్కౌంటర్లు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నందున, కోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు వికాస్ దూబె కు చెందిన ఇంటిని, ఇతర ఆస్తులను కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు నేలమట్టం చేశారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, ఈ విధంగా చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని ఉపాధ్యాయ తన పిటిషన్లో ఆరోపించారు. పోలీసులు తనను ఎన్కౌంటర్లో చంపేస్తారని భయం చేత వికాస్ దుబే పోలీసులకు లొంగిపోయి ఉండవచ్చని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న వికాస్ దుబే కు ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి ప్రాణాపాయం ఉన్నందున, అతని ప్రాణాలకు హాని తలపెట్టకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించ వలసిందిగా కూడా పిటిషనర్ కోరారు. ఈ సంఘటనలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన వలసిందిగా పిటిషన్ లో కోరారు. వికాస్ దూబె ఎన్ కౌంటర్ కు కొన్ని గంటల ముందే సుప్రీంకోర్టులో న్యాయవాది ఘనశ్యామా ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.