
ఆళ్లగడ్డ (విభారె): ఒక వైపు కరోనా విజృంభిస్తోంది. మరో వైపు దోమలు విజృంభిస్తున్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలో ఇప్పటికి పదిహేడు కరోనా కేసులు, రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. పారిశుద్ధ్య నిర్వహణ కోసం లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. కానీ ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని విశ్వరూప కాలనీ వద్ద మాత్రం మురుగునీటి గుంటలు శుభ్రం చేసే వారే లేరు. మురుగు నీటి గుంటలు మురుగునీటితో నిండుగా ఉన్నాయి. దీంతో అక్కడ దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజాధనం వృధా అయిపోతున్నా మురికి కాలువలు మాత్రం నిర్మాణం కావడం లేదు. ప్రజాధనం ఖర్చు చేసి నిర్మాణం చేసిన మురికి కాలువలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఫిర్యాదు చేసినా కూడా మున్సిపాలిటీ అధికారులకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. సరైన అవగాహన లేకుండా నిర్మించిన మురుగు నీటి కాలువల వల్ల మురుగునీరు ఎటు పారే అవకాశం లేక కాలువలోనే పేరుకుపోతోంది. నగర పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం మాత్రం, తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకుని తమకేమీ పట్టనట్లు చేతులు దులుపుకుంటున్నారు. దోమలు ఈగల వల్ల ఆ ప్రాంత వాసులు నరకయాతన పడుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా మురుగు కాలువలు శుభ్రం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మురుగునీటి సమస్యతో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని విశ్వరూప నగర్ కాలనీవాసులు సతమతమవుతున్నారు. కనుక అధికారులు వెంటనే తగిన చర్య తీసుకొన వలసినదిగా స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో త్వరలోనే మురుగునీటి కాలువల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు