ఆళ్లగడ్డ:(విభారె న్యూస్):
భూమా నాగిరెడ్డి శోభా దంపతుల రాజకీయ వారసురాలిగా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. 2014లో ఆళ్లగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై టిడిపిలో మంత్రి పదవి దక్కించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రిగా పని చేసిన అఖిల ప్రియ 2019 వ సంవత్సరం లో జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఒకవైపు రాజకీయాలు కొనసాగిస్తూనే సినీ నిర్మాణ రంగంలో కూడా రాణించాలని ఆ వైపు అడుగులు వేస్తున్నట్లు గా తెలిసింది. తన భర్త భార్గవ్ రామ్ నాయుడుతో కలిసి మూవీ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.భూమా నాగిరెడ్డి తండ్రి కీర్తిశేషులు భూమా బాలిరెడ్డి గారు అప్పట్లో సినీ నిర్మాణ రంగంలో ఉండే వారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే వీరశేఖర్ రెడ్డి కూడా సినీ నిర్మాణ రంగంలో రాణించారు. మొదటినుంచి సినిమా రంగంలో పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఉపయోగించుకొని తాను కూడా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి రాణించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.ఈసంవత్సరం ఆరంభంలోనే సినీ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. అత్యధికంగా పోటీ ఉన్న సినిమారంగంలో అఖిలప్రియ ప్రయత్నాలు ఎంత మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుత శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఒకప్పుడు సినీ నిర్మాణ రంగంలో విజయం సాధించిన వారే. మొత్తం మీద ఆళ్లగడ్డలో అటు భూమా ఇటు గంగుల కుటుంబాలు రెండు సిని నిర్మాణ రంగంలో రాణించిన వారే కావడం విశేషం.