లాక్ డౌన్.. ఉన్నట్టా..? లేనట్టా..?

  • – హైదరాబాద్లో లౌ డౌన్ పై ఉత్కంఠ 
  • – కేబినెట్ భేటీ లేనట్టేనా..? 
  • – డైలామాలో కేసీఆర్ – జనాల్లో గందరగోళం 
  • – వ్యాపారులపై తీవ్ర ప్రభావం 
  • – లా డౌన్ వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి 
  • – మళ్లీ అప్పులు పెరిగే అవకాశం 
  • – గ్రామబాట పడుతున్న నగర జనం 
  • – తర్జనభర్జనలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం 

హైదరాబాద్,జ్యోతిన్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత రెండు వారాలుగా వెయ్యికి కాస్త అటు ఇటుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గత నాలుగు రోజులుగా దీనిపై రెండు,మూడు రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారన్న కథనాలు వినిపించాయి. జూన్ 1 లేదా 2 తేదీల్లో కేబినెట్ సమావేశం ఉండవచ్చునని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటికీ కేబినెట్ భేటీపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో ప్రజలకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సేఫ్ కాదని భావిస్తున్న వాళ్లు గ్రామాలకు తరలి పోతున్నారు. ఇక్కడే ఉండాలనుకున్నవాళ్లు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం ఎలాంటి పంథా అనుసరించాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా గజ్వేల్ లోని తన ఫామ్ హౌజ్ లో ఐఏఎస్లు,వైద్యా నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించిన చెన్నై,బెంగాల్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ హైదరాబాద్లో లాక్ డౌన్ విధిస్తే రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తు తాయి. ఒకవేళ లాక్ డౌన్ విధించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఖజానా గురించి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 55 రోజుల లాక్ డౌన్ పీరియడ్లో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం చాలావరకు పడిపోయింది. ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది తలెత్తడంతో 50 శాతం వేతనాలతోనే సరిపెట్టారు. అvక్ 1.0 తర్వాత హైదరాబాద్ నుంచి ఆదాయం రావడం మొదలవడంతో రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడింది. జూలై నెలకు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి గ్రేటర్ పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే ఆదాయం పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న రెవెన్యూ,ఎక్సైజ్ విభాగాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తితే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి లాక్ డౌన్ పెట్టాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం ఎటూ

తేల్చుకోలేకపోతోంది. హైదరాబాద్లో ఒకవేళ లాక్ డౌన్ పెట్టకపోతే కరోనా నియంత్రణ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చి ఆ తర్వాత కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అలా అయితే అన్ని రకాల కార్యకలాపాలు ఒక్క పూటకే పరిమితమై కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉండవచ్చునని భావిస్తోంది. గత లాక్ డౌన్ పీరియడ్ లాగా కంటైన్మెంట్ ప్రాంతాలను పూర్తిగా లాక్ చేసి టెస్టుల సంఖ్యను పెంచితే ఫలితం ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడైనా కరోనా పాజిటివ్ కేసు నమోదైతే ఆ ఇల్లు లేదా అపార్ట్మెంట్ వరకే కంటైన్మెంట్ చేస్తున్నారు. అలా కాకుండా మళ్లీ పాత పద్ధతినే అనుసరించాలా అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో హైదరాబా’ పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టెస్టుల సంఖ్యను పెంచడం,టెస్టుల ఫలితాలను కూడా వేగవంతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలామంది నగరం నుంచి గ్రామాల బాట పట్టారు. ఇక్కడే ఉందామనుకునేవాళ్లు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ప్రకటించినా… అందుకు సిద్ధంగా ఉండేలా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రభుత్వం లాక్ డౌన్ పై త్వరగా స్పష్టతనిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రజల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో త్వరగా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక పేద,దిగువ మధ్య తరగతి కుటుంబాలు.. మరోసారి లాక్ డౌన్ విధిస్తే తమ ఉద్యోగ, ఉపాధి దెబ్బతింటుందని వాపోతున్నారు. ఇప్పటికే 55 రోజుల లాక్ డెతో ఇళ్ల అద్దెలు కట్టలేక,కుటుంబ పోషణ భారమై చితికిపోయి ఉన్నామని, ఇలాంటి స్థితిలో మళ్లీ లాక్ డౌన్ అంటే తమ పరిస్థితేంటని వాపోతున్నారు.