వివాహమైన రెండో రోజే

వివాహమైన రెండో రోజే వరుడు కరోనాతో మృతి : పెళ్లి వేడుకలో పాల్గొన్న 110 మందికి పాజిటివ్ పాట్నా: కంటికి కనబడకుండా కబళిస్తున్న కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ వినకుండా పెడచెవిన పెడుతూ తాము కరోనా బారిన పడుతూ ఇతరులకు కూడా వ్యాధి వ్యాప్తి చేస్తున్నారు.శుభకార్యాల్లో కూడా అతి త‌క్కువ‌మంది పాల్గొనాల‌ని హెచ్చరించినప్పటికీీ ఖాతరు చేయడం లేదు. బీహార్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నిబంధనలు పాటించక పోవడం వలన విషాదాంతమైంది.పాట్నాకు స‌మీపంలోని‌ పాలిగంజ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గుర్‌గావ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ‌జూన్ 15‌న అతని వివాహం బిహార్‌లో జ‌రిగింది. వివాహానికి ముందే అతనిలో కరోనా లక్షణాలు బయటపడినప్పటికీ అది డయేరియా గా అనుమానించి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ పరిస్థితులలోనే వ‌రుడి కుటుంబస‌భ్యులు ఒత్తిడి తెచ్చి యువ‌కుడి వివాహం వైభవంగా జ‌రిపించారు. వివాహ‌మైన రెండో రోజే పెళ్లి కుమారుడు మృత్యువాత‌ప‌డ్డాడు.మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా క‌లెక్ట‌ర్‌ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అప్ప‌టికే కుటుంబస‌భ్యులు అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి చేయ‌డంతో అత‌నికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష నిర్వ‌హించ‌లేక‌ పోయిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. వరుడు క‌రోనా తోనే మరణించినట్లు గుర్తించిన అధికారులు మొదట అత‌ని సమీప బంధువుల్లో 15మందికి కొవిడ్‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వారంద‌రికీ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అప్ప‌టికే పెళ్లికి హాజ‌రైన‌ వారిలో చాలామందిలో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లు గుర్తించిన అధికారులు వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పెళ్లికి హాజరైన వారిలో 110మందికి పైగా క‌రోనా వైర‌స్‌ సోకినట్లు తేలింది. పెళ్లి కుమార్తెకు మాత్రం వైర‌స్ సోక‌లేద‌ని చెప్పారు. అధికారులు ఈ వివాహానికి హాజరైన 350 మందిని వెతికే ప‌నిలోప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో పెళ్లికి హాజ‌రైన వారితోపాటు అంత్య‌క్రియ‌ల‌కు హాజరైన వారిని కూడా గుర్తించే ప‌నిలోప‌డ్డారు అధికారులు. ఇప్ప‌టికే దాదాపు 400 మందిని గుర్తించిన అధికారులు, ప్ర‌త్యేక క్యాంపు ఏర్పాటు చేసి వారందరికీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.