తొలి ఏకాదశి ప్రాశస్త్యం

మహానంది పుణ్యక్షేత్రంలో జూలై 1న  తొలి ఏకాదశి వేడుకలు  :శ్రీ మహానందీశ్వర దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాని 

 మహానంది:(విభారె న్యూస్): మహానంది క్షేత్రం లో జులై 1వ తేదీ బుధవారం నాడు తొలి ఏకాదశి పండుగ కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని శ్రీ మహానందీశ్వర దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు”ఈ సందర్భంగా ప్రత్యేక మూలికలు, ఔషధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి, మూలవర్లకు, విశేషార్చనలు, ఉత్సవర్లకు తిరుమంజనం జరుగుతుంది.ఈరోజు అన్నప్రసాద నివేదన ఉండదు. కేవలం ఫలములు మాత్రమే నివేదన చేస్తారు.ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వం ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువును యమ దంష్ట్రిక (యముడి కోరలు) అని  అంటారు.ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది పలికిందే ఈ  తొలి ఏకాదశి.మరియు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళిన తొలిరోజ కావున తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన మవుతాయి.ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర నాటి నుండి భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి.తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ అత్యంత పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే  “ఏకాదశి” అంటారు.సన్యాసం తీసుకున్నవారు  ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టిన వారు ఈ నాలుగు నెలలపాటు బయటకు రారు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. ఈ సమయంలో జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. అందరూ ఈరోజున పేలపిండిని ఖచ్చితంగా తినాలి” అని శ్రీ మహానందీశ్వర దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు.