కాల చక్ర విభజన

కాల చక్రాన్ని కరోనా ముందు, కరోనా తరువాత గా విభజించాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఈ కరోనా ఎందుకొచ్చిందో తెలియదు కానీ మానవ జీవన శైలిలో ఇప్పటికే పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా భవిష్యత్తులో మనం వూహించని ఇంకా అనేక ఆశ్చర్యకర పరిణామాలు మానవ జీవితంలో భాగం కానున్నాయి.

ఒకప్పుడు సహజీవనం అనగానే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక నటి ఇంకొక నటుడు, ఒక సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీతో కలిసి చేసే సహజీవనం గుర్తుకొచ్చేది. కానీ కాలం పూర్తిగా మారిపోయింది. ఇది ఎవరి వైఫల్యమో ఏమో తెలియదు కానీ ప్రపంచ దేశాలన్నీ భయంకరమైన కరోనా రోగంతో సహజీవనం చేయాల్సి వచ్చింది. ఇంతటి దుర్భర పరిస్థితి హీనమైన పరిస్థితి ఎవరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. సహజీవనం తప్పులేదని న్యాయ స్థానాలు తేల్చి చెప్పాయి. కానీ భయంకరమైన, ప్రాణాంతకమైన వైరస్ తో సహజీవనం తప్పదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. భవిష్యత్తు లో మానవ జీవితం ఎలా ఉండబోతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రభుత్వాలు చెబుతున్న తీరును బట్టి భవిష్యత్తును తలుచుకుంటేనే సన్నని వణుకు పుడుతోంది. ఎవరి జీవితము వారి చేతులలోనే ఉందన్న వాస్తవం ప్రజలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.

మాస్కులు శానిటైజర్లు జీవితంలో అంతర్భాగం ఐపోయాయి. అవి మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపనున్నాయి. లాక్ డౌన్ ఎత్తి వేశాక కూడా ప్రజలు ఇంతే క్రమశిక్షణతో మెలిగి ఉంటే కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకో గలిగి ఉండేవాళ్ళం. విందులు వినోదాలు బయటి భోజనాలు మొదలగు వాటి జోలికి వెళ్లడమంటే కరోనాను చంకకు ఎత్తుకొని ఇంటికి తీసుకు రావడమే. ఇప్పటి నుంచి పిల్లలను పదేపదే పరిశుభ్రత గురించి హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వైరస్ ను గురించిన పూర్తి వివరాలతో, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన పాఠ్యాంశాలను సిలబస్ లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలపై కూడా గతంలో కంటే పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చు భారం పెరగనుంది. ప్రజలు కూడా తమ నెలవారీ ఖర్చులలో పరిశుభ్రత కోసం గతంలో కంటే కొంత ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తుంది.

అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మొత్తం రాజకీయ నాయకులంతా కలిసి కరోనా వైరస్ నిర్మూలనపై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. నిరుపయోగమైన విమర్శలు, ప్రతి విమర్శలు, గతాలు తవ్వడం, కక్ష్య సాధింపులు ఆపేసి తమ భాద్యతలు గుర్తెరిగి ప్రజలకు నిజంగా మేలు జరిగే రీతిలో అందరూ కలిసి ప్రజారోగ్య పరిరక్షణకు ఒక సక్రమమైన, సమగ్రమైన ప్రణాళిక రూపొందించి ప్రజలకు మార్గదర్శకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత అనుభవజ్ఞులైన నేటి రాజకీయ నాయకులపైనా ఖచ్చితంగా ఉంది.

ఎడిటర్

“విభారె” తెలుగు దినపత్రి